Zombie Reddy Review
కొత్త కాన్సెప్ట్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్న నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబిరెడ్డి ప్రేకకుల ముందుకు వచ్చింది. జాతీయ అవార్డుల్లో తన మార్క్ చూపించిన అ! సినిమాను తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ వర్మ.. తదుపరి చేసిన కల్కితో నిరాశ పరిచాడు. అయితే, మూడో చిత్రంగా జాంబి జోనర్‌లో సినిమాను తెరకెక్కించాడు. పూర్తిస్థాయి జాంబి చిత్రమిదే అనాలేమో. ఈ జాంబి జోనర్‌కు, ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను మిక్స్ చేసిన ప్రశాంత్ వర్మ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ:
హైదరాబాద్‌లో స్నేహితులతో కలిసి గేమ్ డిజైన్ చేసే మారియొ(తేజ సజ్జ)ను తండ్రి(హర్షవర్ధన్) విమర్శిస్తుంటాడు. మారియొ డిజైన్ చేసిన ఓ గేమ్‌కు మంచి స్పందన వస్తుంటుంది. అదే సమయంలో ఆ గేమ్‌లో చిన్న బగ్ ఉంటుంది. ఆ సమస్యను సాల్వ్ చేసే స్నేహితుడు కిరణ్(హేమంత్) కర్నూలు సమీపంలోని రుద్రవరంలో పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. అతని దగ్గరకు మిగిలిన ఇద్దరు స్నేహితులు దక్షా నగార్కర్, కిరిటీతో కలిసి మారియొ వెళతాడు. కిరణ్ మామ భూమా నాగిరెడ్డి పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఆయన ప్రత్యర్థి వీరా రెడ్డి కిరణ్‌ను చంపడానికి ప్లాన్ చేస్తుంటాడు. విషయం తెలుసుకున్న మారియొ విషయాన్ని కిరణ్‌కు వివరించే ప్రయత్నం చేసినా అతను వినిపించుకోడు. ఆ ఇంట్లో ఉండే నందినీ రెడ్డి వల్ల మారియొ ఇళ్లు వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు రుద్రవరం అడవిలో దాక్కున్న ఓ సైంటిస్ట్ కరోనా వైరస్‌కు మందు కనుగొనే ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రయోగం వికటించి మనుషులు జాంబిగా మారుతారు. ఓ జాంబి మారియో స్నేహితుడు కిరిటీని కొరుకుతాడు. అక్కడి నుంచి అందరూ జాంబీలుగా మారుతారు. అసలు రుద్రవరంలో ప్రయోగాలు చేసే సైంటిస్ట్ ఎవరు? నందినీ ఎవరు? ఫ్యాక్షనిస్టులకు, జాంబిలకు ఉన్న సంబంధమేంటి? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మూడో చిత్రం జాంబి రెడ్డి. ఇలాంటి ఓ కాన్సెప్ట్ సినిమాను టచ్ చేయడం కాస్త సాహసమనే చెప్పాలి. అయితే పూర్తిగా హారర్ పంథాలోనే సినిమాను ప్రశాంత్ వర్మ నడిపించాలని అనుకోలేదు. దీనికి ఫ్యాక్షన్, కాస్త కామెడీ ఎలిమెంట్స్ జోడించే ప్రయత్నం చేశాడు. కరోనా వైరస్‌పై చేసే ప్రయోగాలు వికటించి జాంబిగా మారిన వ్యక్తి వల్ల వచ్చిన ప్రమాదం.. దానికి ఆధ్యాత్మికతను జోడీస్తూ ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఫస్టాఫ్‌ను కథలోకి తీసుకెళ్లే క్రమంగలో సాగదీసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే అసలు కథ సెకండాఫ్‌లో ఉన్నా.. దానికి కామెడీని జోడించి కథలోని సీరియస్‌ను తగ్గించడం వల్ల అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. అలాగే జాంబిగా మారిన వ్యక్తి , మళ్లీ మామూలుగా మారడం.. మళ్లీ జాంబిగా ప్రవర్తించడం అనే లాజిక్ లేని సన్నివేశాలు కూడా సినిమాలో కనిపిస్తాయి. మార్క్ రాబిన్ నేపథ్య సంగీతం బావుంది. అనిత్ కుమార్ విజువల్స్ పరంగా బాగానే చూపించే ప్రయత్నం చేశాడు.
నటీనటుల విషయానికి వస్తే.. తేజ సజ్జ తనదైన నటనతో పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. తొలి సినిమాను ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో చేయాలని అనుకున్నందుకు తనను అభినందించాలి. ఇక దక్షా నగార్కర్ ఇలాంటి పాత్రను చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందనే పక్కాగా చెప్పొచ్చు. ఆనంది రాయలసీమ అమ్మాయిగా.. చక్కగా నటించింది. ఇక హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, విజయ రంగరాజు, వినయ్ వర్మ తదితరులు మంచి పాత్రల్లో నటించారు. ఇక కారుమంచి రఘ, రఘుబాబు, హరితేజ చాలా చిన్న రోల్స్ కనిపించి మెప్పించే ప్రయత్నం చేశారు. జాంబి సినిమా అనే ప్రయోగాన్ని చూడాలనుకునే ప్రేక్షకులు చూడొచ్చంతే...
చివరగా.. కథాగమననంలో లాజిక్స్ మిస్ అయిన జాంబిరెడ్డి
- Read in English