మరణంలేని జననం - అలుపెరగని గమనం - అంతేలేని పయనం ఆయనిది: వై వి ఎస్ చౌదరి
- IndiaGlitz, [Wednesday,January 17 2018]
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగు జాతి ముద్దుబిడ్డ, ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలందరూ ఆప్యాయంగా పిలుచుకునే 'అన్న' మరియు అభిమానుల పాలిట దైవం.. స్వర్గీయ 'నందమూరి తారక రామారావు' గారి దివ్యమోహన రూపం సినిమాల్లో, తాను పోషించిన పాత్రల ద్వారా ఎందరికో స్పూర్తి నిచ్చిందీ, తిరిగి ఆ రూపమే రాజకీయాల్లో తాను ప్రవేశపెట్టిన సంచలన మరియూ సంక్షేమ పధకాల ద్వారా మరెందరికో జనాకర్షణలో మార్గదర్శకంగా నిలిచింది. అంతేకాకుండా అప్పటిదాకా 'మదరాసీ' లుగా పిలవబడుతున్న 'తెలుగు జాతి'కి ప్రపంచ వ్యాప్తంగా ఓ గుర్తింపునీ, 'తెలుగు జాతి'లో ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చింది. ఆయన తన జీవనవిధానం ద్వారా చాలా ఆశయాలని మన ముందు వదిలి వెళ్ళారు. వాటిలో..
'ఏ పనినైనా అంకితభావంతో చేయడం,
ఆ పని ఎంత కష్టమైనా ఇష్టపడి చేయటం,
తాను నమ్మిన ఆ పనిని సాధించటంలో మడమ తిప్పకుండా పోరాటం చెయ్యటం'..
లాంటివి మచ్చుకకి కొన్ని మాత్రమే.
'ఇండియా'లోని ఓ రిక్షాపుల్లర్ నుండి 'అమెరికా'లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వరకూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, వివిధ రంగాలలో ఉన్న చాలా మందికి, ఆయన తన రూపం ద్వారా ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చారు, తన ఆశయాలు, ప్రసంగాల ద్వారా ఇంకెంతో ఉద్వేగాన్ని నింపారు. దాంతోపాటు తన సినిమాల ద్వారా, హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన.. మహాభారత, భాగవత, రామాయణాల్లోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ళముందు కదలాడి, అసాధ్యాలను సుసాధ్యాలుగా మలుస్తూ.. ఓ మహాయోధుడిగా, ఓ కారణజన్ముడిగా, ఓ యుగపురుషుడిగా అవతరించారు.
ఆయన నాకు దేవుడు. నాలాగా ఎంతోమందికి దైవసమానం. ఆయన దివ్యమోహనరూపమే నన్ను సినిమాలవైపు తద్వారా సినీపరిశ్రమకు తీసుకువచ్చింది. అందుకే నా సొంత చలనచిత్ర నిర్మాణ సంస్థ అయిన బొమ్మరిల్లు వారి' బేనర్‌పై నేను నిర్మించే ప్రతీ సినిమా ప్రారంభం ఆయన ఫొటోపై..
'నా పరిపూర్ణ, పరిశుద్ధ హృదయంతో,
నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడూ,
ప్రభూ.. ఈ జన్మకూ..'
అంటూ సంగీత సవ్యసాచి 'యం యం కీరవాణి' గారు స్వయంగా రచించి, స్వరపరచి, ఆలపించిన ప్రార్ధనాగీతంతో మొదలై, మళ్ళీ సినిమా చివరిలో ఆయన అదే ఫొటోపై కృతజ్ఞతాభావంతో పూర్తి అవుతుంది. ఆయన ఎక్కడున్నా నన్నూ, నాలాంటి అభిమానుల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటారనే నా నమ్మకం.
'మరణంలేని జననం ఆయనిది,
అలుపెరగని గమనం ఆయనిది,
అంతేలేని పయనం ఆయనిది..'
'తెలుగు జాతి'కి గర్వకారణం మరియూ 'తెలుగు పలుకు'లను తన కంఠంతో కొత్తపుంతలు తొక్కించిన ఆ 'అవిశ్రాంత యోధుడు' సరిగ్గా 22 ఏళ్ళ కిందట 18, జనవరి 1996న మరో మహత్తర కార్య సాధన కోసమై ఈ భువి నుండీ దివికేగాడు. అప్పటి నుండీ ప్రతీ సంవత్సరం ఇదే రోజున ప్రతీ 'తెలుగు'వాడూ బాధాతప్త హృదయాలతో, ఆ మహనీయుడుని స్మరించుకోవటం అనేది తమ జాతినీ, తమ భాషనీ మరియూ తమని తాము గౌరవించుకున్నట్లగా భావిస్తూ వస్తున్న సందర్భంగా..
'జోహార్ నటరత్నం,
జోహార్ తెలుగుతేజం,
జోహార్ విశ్వవిఖ్యాతం,
జోహార్ ఎన్. టి. ఆర్..'
అంటూ మరొక్కసారి ఎలుగెత్తి చాటాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ..