ఏపీలోనూ పార్టీ.. అక్కడ నేను పెట్టకూడదని రూల్ లేదుగా: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్‌టీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడుతున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అంటూ ఎదురు ప్రశ్నించారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని ఆమె స్పష్టం చేశారు. తాము ఒక మార్గాన్ని ఎంచుకున్నామని.. ఆ విధంగానే ముందుకెళ్తున్నామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ నెల 19 లేదా 20న తెలంగాణలో మళ్లీ పాదయాత్ర చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
కాగా.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల దానిని జనాల్లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రైతులు, నిరుద్యోగుల కోసం ఆమె పలు దీక్షలు చేపట్టారు. దీనితో పాటు పాదయాత్ర సైతం చేశారు. కానీ ఆమె పార్టీలోకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఇతర పార్టీలకు చెందిన నేతలు వచ్చి చేరలేదు. ఇందిరా శోభన్ వంటి నేతలు వచ్చినా మధ్యలోనే హ్యాండిచ్చారు. అలాగే అంతర్గత విభేదాల కారణంగా పలువురు కీలక నేతలు సైతం రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీలోకి టీఆర్ఎస్ సీనియర్ నేత , బీసీ నేత గట్టు రామచంద్రరావు చేరారు. సోమవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి రామచంద్ర రావును పార్టీలోకి ఆహ్వానించారు.
మరోవైపు కొద్దిరోజుల నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు, షర్మిలకు పడటం లేదని, వీరిద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయని మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయలో ఇటీవల జరిగిన క్రిస్మస్ వేడుకల్లోనూ అన్నాచెల్లెళ్ల మధ్య కనీసం మాటలు లేకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments