జేడీ వ‌చ్చారు కాబ‌ట్టి వైసీపీ ఇక రాదు!

  • IndiaGlitz, [Thursday,March 21 2019]

క్రిమిన‌ల్ నాయ‌కుల భ‌ర‌తం ప‌ట్టేందుకే విశాఖ‌ప‌ట్నం పార్లమెంటు స్థానం నుంచి ఆయ‌న్ని నిల‌బెట్టాం. మాజీ జేడీ వ‌చ్చారు కాబ‌ట్టి వైసీపీ ఇక రాదు. వైసీపీని గెలిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా. తెలుగుదేశం పార్టీ నేత‌ల క‌బ్జాలు ఒక ఎత్తయితే, వీరు ఏకంగా మీ ఇళ్లు లాగేసుకుంటారు. కొండ‌లు దోచేస్తారు అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

గురువారం విశాఖ‌ప‌ట్నం జిల్లా గాజువాక శాస‌న‌స‌భ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అనంత‌రం గాజువాక లంక గ్రౌండ్స్‌లో నిర్వహించిన బ‌హిరంగ‌స‌భ‌లో పవన్ మాట్లాడుతూ.. విశాఖ నుంచి నిల‌బెట్టిన ఎంపి అభ్యర్ధి సీటు ఇస్తే పారిపోయే వ్యక్తి కాదని.. నిల‌బ‌డే వ్యక్తిని తీసుకువ‌చ్చామన్నారు. జ‌న‌సేన మీకు అండ‌గా ఉండాలి అంటే.. పార్టీ నిల‌బ‌డాలి అంటే అటువంటి ధైర్యవంతులే కావాలన్నారు. ఇది మార్పు కోసం జ‌రుగుతున్న పోరాటం భ‌విష్యత్తు కోసం చేస్తున్న పోరాటమన్నారు. అలాంటి వ్యక్తుల అవ‌స‌రం ఎందుకు కావాలి అంటే.. ఇదే గాజువాక‌లో మనం టీడీపీ-బీజేపీల‌కి మ‌ద్దతు ఇస్తే గెలిచాక అంతా క‌బ్జాల‌మ‌యం, భూదోపిడిలు, కుంభ‌కోణాల‌మ‌యం చేసేశారని.. వీరి తాట తీయ‌డానికే మాజీ జేడీ ల‌క్ష్మినారాయ‌ణను ఇక్కడ్నుంచి పోటీ చేయిస్తున్నానన్నారు.

ఏ ముఖంపెట్టుకొని ఓట్లు అడుగుతారు..

క్రిమిన‌ల్ నాయ‌కుల భ‌ర‌తం ప‌ట్టేందుకే విశాఖ‌ప‌ట్నం పార్లమెంటు స్థానం నుంచి ఆయ‌న్ని నిల‌బెట్టాం. జేడీ వ‌చ్చారు కాబ‌ట్టి వైసీపీ ఇక రాదు. వైసీపీని గెలిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా. తెలుగుదేశం పార్టీ నేత‌ల క‌బ్జాలు ఒక ఎత్తయితే, వీరు ఏకంగా మీ ఇళ్లు లాగేసుకుంటారు. కొండ‌లు దోచేస్తారు. అందుకే అవినీతిని అంత‌మొందించ‌డానికి విశాఖ న‌గ‌రానికి ఒక కొత్వాల్‌గా జేడీని తీసుకువ‌చ్చాను. అన్యాయం తోలు తీసే కొత్వాల్ ఆయ‌న‌. డ‌బ్బిచ్చి కిరాయి మూక‌ల్ని తీసుకువ‌స్తే వారికి స‌రైన ట్రీట్‌మెంట్ ఇచ్చే కొత్వాల్ కాబ‌ట్టే ఆయ‌న్ని విశాఖ‌కి ఎంపిక చేశాం. ఇప్పుడు చూద్దాం వైసీపీ నాయ‌కులు ఏ ముఖం పెట్టుకుని వ‌చ్చి ఆయ‌న ఎదురుగా ఓట్లు అడుగుతారో అని పవన్ ఎద్దేవా చేశారు. పార్టీ కోసం క‌ష్టప‌డిన ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుంటామ‌ని జనసేనాని హామీ ఇచ్చారు.