YSRCP:టైమ్స్ నౌ సర్వే: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే .. ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ .. బాబు , పవన్ గాలి నామమాత్రమే
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ, ఈసారి ఎలాగైనా అధికారాన్ని సంపాదించాలని టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఓ 30 నుంచి 40 స్థానాల్లో గెలిచి కింగ్ మేకర్ కావాలని జనసేన కూడా ఎత్తులు వేస్తోంది. వీటితో పాటు జగన్‌ను ఓడించడానికి బీజేపీ, జనసేనతో కలిసి పొత్తులతో వెళ్లాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఓ వైపు.. విపక్షాలన్నీ మరోవైపు బరిలో దిగుతూ..ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించాయి. అన్ని పార్టీలు క్షేత్ర స్థాయి నుంచి అభ్యర్ధుల ఎంపిక వరకు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
ఎన్నికల ప్రచారంలో ముందున్న జగన్ :
అందరికంటే ఎన్నికల సమరంలో దిగేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వై నాట్ 175 టార్గెట్ ఫిక్స్ చేసి నేతలను ప్రజల్లో వుండేలా గడప గడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి మంచి ఫలితాలే వస్తున్నాయి. దీని తర్వాత జగనన్నకు చెబుదాం, నువ్వే మా నమ్మకం జగనన్న, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలతో ఆయన ముందుకు సాగారు. విపక్షానికి వస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా పర్యటనలు చేస్తుండగా.. లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా తన బలాన్ని , బలగాన్ని చూపిస్తూ.. పోటీలో నేను కూడా వున్నానని చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్ధితుల్లో ఏపీకి కాబోయే సీఎం ఎవరు అనే చర్చ నడుస్తోంది.
సర్వే ఏదైనా జగనే సీఎం:
కానీ.. ఎన్నికల సమయంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సర్వేలు నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికలకు సంబంధించి పలు సంస్థలు సర్వేల మీద సర్వేలు నిర్వహిస్తున్నాయి. అయితే ఏ సంస్థ సర్వే నిర్వహించినా జగన్ పేరే మార్మోగుతోంది. ఇప్పటికే జూలై నెలలో టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో మరో మాట లేకుండా జగనే సీఎం అవుతారని తేలింది. అంతేకాదు.. పార్లమెంట్ ఎన్నికల్లో 24 నుంచి 25 సీట్లు గెలిచి.. కాంగ్రెస్, బీజేపీ తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ నిలుస్తుందని అంచనా వేసింది.
ఈసారి ఏపీ లోక్‌సభ స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోకే :
తాజాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏ పార్టీ ఎలాంటి రిజల్ట్‌ను పొందుతున్న దానిపై ‘ఈటీజీ - టైమ్స్ నౌ సర్వే’’ నిర్వహించింది. దీనిలో భాగంగా తెలుగు రాష్ట్రాల పరిస్థితిని కూడా అంచనా వేసింది. దీని ప్రకారం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తేలింది. అధికార పార్టీకి 24 నుంచి 25 సీట్లు లభిస్తాయని సర్వేలో తేలింది. గత లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ 22 స్థానాల్లో విజయం సాధించింది. అయితే తాజా సర్వే ప్రకారం ఈసారి మాత్రం మరో రెండు మూడు స్థానాల్లో వైసీపీ గెలుస్తుందట. ఇదే సమయంలో టీటీపీకి మాత్రం ఈ సర్వే షాక్ ఇచ్చింది. చంద్రబాబు పార్టీకి 1 సీటు మాత్రమే వచ్చే అవకాశాలు వున్నాయని అంచనా వేసింది. అలాగే సినీనటుడు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంది.
తెలంగాణలో బీఆర్ఎస్ హవా :
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. అధికార బీఆర్ఎస్ హవా కనిపిస్తుందని తెలిపింది. గులాబీ పార్టీ 9 నుంచి 11 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. బీజేపీకి 2 నుంచి 3 కాంగ్రెస్‌కు 3 నుంచి 4 సీట్లు, ఇతరులకు ఒక సీటు వస్తుందని అంచనా వేసింది. బీఆర్ఎస్‌కు 38.40 శాతం , బీజేపీకి 24.30, కాంగ్రెస్‌కు 29.90 శాతం, ఇతరులకు 7.40 శాతం మేర ఓట్లు లభిస్తాయని వెల్లడించింది. ఈ ఫలితాలు గులాబీ దండుకు ఊపు తీసుకొస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా స్థానాలే తమవేనని చెబుతున్న కేసీఆర్ మరింత రెచ్చిపోవచ్చు.
ఎన్డీయే దూకుడు :
అటు జాతీయ స్థాయిలో ఎన్డీయే అప్రతిహతంగా దూసుకుపోతుందని సర్వే స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 296 నుంచి 326.. ప్రతిపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని తెలిపింది. ఎన్డీయేలోని ఇతర భాగస్వామ్య పార్టీల మద్ధతు లేకుండా బీజేపీ సొంతంగా 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ సొంతంగా 62 నుంచి 80 స్థానాలు గెలుచుకునే అవకాశాలు వున్నాయి. ఎన్డీయే కూటమికి 42.60 శాతం, ఇండియా కూటమికి 40.20 శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout