సీమలో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా.? టీడీపీ ప్రభావం చూపిస్తుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
గతంలో కంటే ఈసారి ఏపీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గెలుపు కోసం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. విజయం తమదేంటూ నమ్మకంతో ఉన్నాయి. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో ప్రచారం చేస్తుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి మంచి పట్టున్న రాయలసీమలో గెలుపు ఎవరికి దక్కుతుందో అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఎందుకంటే 2019 ఎన్నికల్లో సీమలోని 52 నియోజకవర్గాలకు గాను 49 స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరింది. కేవలం మూడు సీట్లకే టీడీపీ పరిమితమైంది. అది కూడా కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ గెలిచారు. సీమ గడ్డ మీద భారీ స్థాయిలో సీట్లు గెలవడంతో వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు దక్కాయి. అయితే ఈసారి మాత్రం టీడీపీ నుంచి ఆ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. చంద్రబాబు నిర్వహించిన సభలకు సీమ ప్రజలు భారీగా రావడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి మాత్రం ఎదురీత తప్పేలా లేదు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించనుంది. వివేకా హత్య కేసు నిందితులను జగన్ కాపాడుతున్నారని టీడీపీ నేతలతో పాటు వైయస్ షర్మిల, సునీతారెడ్డి కూడా తీవ్ర విమర్శలు చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున షర్మిల బరిలో దిగారు. వివేకా హత్య కేసు నిందితుడు అవినాశ్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యం అని ఆమె స్పష్టంచేస్తున్నారు. దీంతో ఈసారి సొంత జిల్లాలోనూ జగన్కు గట్టి పోటీ తప్పదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇక కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈసారి ఆ పార్టీలో వర్గపోరుతో పాటు అవినీతి ఆరోపణలతో నేతలు ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ జిల్లాలో పోరు నువ్వానేనా అన్న రీతిలో సాగుతోంది. ముఖ్యంగా నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ, శ్రీశైలం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థులు విజయం కోసం పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు అనంతపురం జిల్లాలోనూ వైసీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ జిల్లాలో ఆ పార్టీకి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో 14 నియోజకవర్గాలకు గాను హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఈసారి మాత్రం ఈ రెండు స్థానాలతో పాటు తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం, గుంతకల్లు, రాయదుర్గం, కల్యాణుదర్గం, పుట్టపర్తి, కదిరి, సింగనమల నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు బలంగా ఉన్నారు. దీంతో ఈసారి ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు జిల్లా వాసులు భావిస్తున్నారు.
అటు చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల్లో టీడీపీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. అది కూడా కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే విజయం సాధించారు. దీంతో ఈసారి మెజార్టీ స్థానాలు గెలవాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. శ్రీకాళహస్తి, మదనపల్లి, పీలేరు, పూతలపట్టు, నగరి, తిరుపతి, సత్యవేడు, పలమనేరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో వైసీపీకి పసుపు కండువా అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా తొలి నుంచి చంద్రబాబు రాజకీయ శత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరేయాలని కసితో ఉన్నారు.
మొత్తంగా చూసుకుంటే రాయలసీమ పరిధిలోని 52 నియోజకవర్గాల్లో ఒక్క 10 నియోజకవర్గాలు తప్పితే మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల నేతలు గెలుపు మీద ధీమాగా ఉన్నారు. గతంలో ఎదురైన ఘోర పరాభవం దృష్టిలో పెట్టుకుని ఈసారి మెజార్టీ స్థానాలు గెలుస్తామని తెలుగుదేశం నేతలు చెబుతుంటే.. 2019 ఎన్నికల ఫలితాలను మరోసారి రిపీట్ చేస్తామని అధికార వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తు్న్నారు. ఇక సీఎం అభ్యర్థులుగా ఉన్న జగన్, చంద్రబాబు సీమ నుంచే పోటీ చేయనుండటంతో ఇక్కడి ఫలితాలు ఆసక్తిగా మారాయి. మరి సీమ గడ్డ మీద ఈసారి ఏ పార్టీ జెండా బలంగా ఎగరనుందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments