ఎన్నిక ఏదైనా రిజల్ట్ ఒకటే: ‘‘పంచాయతీ’’లో వైసీపీ జయభేరి, టీడీపీకి షాక్.. చంద్రబాబు ఇలాఖాలోనూ పరాభవం
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఉప ఎన్నిక జరిగినా.. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక, నగరపాలక ఎన్నికలు .. ఇలా ఏది చూసుకున్న జగన్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రభుత్వంపై లేనిపోని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు మాత్రం జగన్ సంక్షేమ పాలనకు పట్టం కట్టారు. అందుకే రికార్డు స్థాయి మెజారిటీతో వైసీపీని గెలిపిస్తూ వస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన పంచాయతీ , సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. తద్వారా ఎన్నిక ఏదైనా, ఎప్పుడొ చ్చినా వైసీపీ విజయ పరంపర కొనసాగుతూనే వుంటుందని మరోమారు రుజువైంది.
53 సర్పంచ్ స్థానాలు వైసీపీ ఖాతాలోకి :
రాష్ట్రంలో మొత్తం 66 గ్రామాల సర్పంచ్ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏకగ్రీవమైన 30 సర్పంచ్ పదవులు వైఎస్సార్సీపీ మద్దతుదారులకే దక్కాయి. మిగిలిన 34 స్థానాలకు గాను 23 చోట్ల అధికారపార్టీ మద్దతుదారులు విజయకేతనం ఎగురవేశారు. 10 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు, ఒక స్థానం జనసేన మద్దతుదారు కైవసం చేసుకున్నారు. మొత్తం 1,082 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 243 వార్డుల్లో 149 వైఎస్సార్సీపీ, 90 టీడీపీ, 4 జనసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. మొత్తం మీద ఏకగ్రీవాలతో కలిపి 810 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7 వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు.
చంద్రబాబు ఇళ్లున్న వార్డులోనూ వైసీపీ మద్ధతుదారుదే విజయం :
ఇదంతా ఒక ఎత్తయితే.. తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం, కుప్పం నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడంతో ప్రధాన ప్రతిపక్షానికి మింగుడు పడటం లేదు. హిందూపురం నియోజకవర్గం చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్ధతుదారులు విజయం సాధించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అందులో ఐదుగురు వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. చివరికి చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైఎస్సార్సీపీ మద్దతుదారుడే గెలుపొందడం విశేషం. కేవలం ఒక్క స్థానంతో టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
తాడిపత్రిలో కనిపించని జేసీ ప్రభావం :
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని అడ్డుకుని తాడిపత్రిలో టీడీపీని గెలిపించిన జేసీ బ్రదర్స్ ఎత్తులు ఈసారి ఫలించలేదు. తాడిపత్రి నియోజకవర్గంలోని జేసీ బ్రదర్స్ సొంత మండలం పెద్దపప్పురులో వైసీపీ మద్ధతుదారులే గెలుపొందారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో నాలుగు సర్పంచ్ స్థానాలకు గాను వైసీపీ మద్ధతుదారులు మూడు చోట్ల , టీడీపీ మద్ధతుదారు ఒక చోట గెలుపొందారు. పది వార్డులకు గాను వైసీపీ మద్ధతుదారులు ఆరు చోట్ల, టీడీపీ సానుభూతిపరులు నాలుగు చోట్ల విజయం సాధించారు.
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ :
మొత్తం మీద చెదరుమదరు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. రెండు గంటల తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించి, 7 గంటల లోపే విజేతలను ప్రకటించినట్లు ఈసీ తెలిపింది. ఈ ఫలితాలతో వైసీపీ కేడర్ సంబరాలు జరుపుకుంటూ వుండగా.. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఉప ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. ఈ రిజల్ట్స్‌తో అధికార పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com