YSRCP:అట్లుంటాది మరి మనతో పెట్టుకుంటే .. జగన్ జోలికి వచ్చారో : దూకుడుతో బెంబేలెత్తిస్తోన్న వైసీపీ సోషల్ మీడియా
Send us your feedback to audioarticles@vaarta.com
కాలక్షేపానికి, మనసులో వున్న భావాలను పంచుకోవడానికి వచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు మనిషి జీవితంలో భాగమైపోయింది. అంతేనా వ్యక్తులను, వ్యవస్థలను, చివరికి దేశాలను సైతం ఇప్పుడు సోషల్ మీడియా శాసిస్తోంది. ఎన్నెన్నో ఉద్యమాలకు, పోరాటాలకు సోషల్ మీడియా ఊపిరి పోసింది. ప్రభుత్వాలు సైతం సోషల్ మీడియా జోరుకు ముకుతాడు వేయాలని భావించి విఫలమవుతున్నాయి. ఎంత కంట్రోల్‌లో పెట్టాలని చూస్తుంటే అంతగా శక్తివంతంగా మారుతోంది ఈ మాధ్యమం.
దుష్ప్రచారం కోసం పెయిడ్ సంస్థలు :
సోషల్ మీడియా రాకతో ప్రతి వార్తా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇదే సమయంలో ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పలేని పరిస్ధితి. ఎవరైనా సెలబ్రెటీ ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో జాయిన్ అయితే చాలు వారు చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ఫలానా ప్రముఖులు తామే బతికే వున్నామని .. తప్పుడు వార్తలు నమ్మొద్దంటూ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. అంతేనా దీనిని అడ్డుపెట్టుకుని మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన రాతలతో సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం పెయిడ్ సంస్థలు సైతం పుట్టుకొచ్చాయి. ప్యాకేజీలు ఇస్తే ఎవరినైనా, ఎంతటి వారినైనా సరే టార్గెట్ చేస్తామని చెబుతున్నాయి ఈ సంస్థలు. వీరితో పాటు కొందరు ఇష్టమైన వారి కోసం పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు.
ప్రత్యర్ధి నేతల కుటుంబాల్లోని మహిళల్ని లాగుతున్న వైనం:
ఇక రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తం సమాజాన్ని, వ్యవస్థలను ఒక చిన్న పోస్ట్, ఓ ట్వీట్ ఎంతగానో ప్రభావితం చేస్తుంది. దీంతో ఆ మాధ్యమానికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పొలిటికల్ పార్టీలు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యింది సోషల్ మీడియా చలవ వల్లనేనన్నది బహిరంగ రహస్యం. అయితే ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు వికృత చేష్టలకు దిగుతున్నారు. తద్వారా తమ పార్టీ అధినేతలు, పెద్దల దృష్టిని ఆకర్షించి రాజకీయంగానో, మరేదైనా రకంగానో లబ్ధి పొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో సంఘంలో అవాంచనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాలు సమాజ పురోగతిపై తీవ్ర ప్రభావం చూపితే.. రాజకీయాల్లో సోషల్ మీడియా కాలుష్యాన్ని సృష్టిస్తోంది. పార్టీ పెద్దల దృష్టిలో పడాలనే ఉద్దేశంతో ప్రత్యర్ధి పార్టీ నేతల కుటుంబాల్లోని మహిళలను లాగుతున్నారు. వారిపై నీచమైన పోస్టులు పెట్టడం, వారి వ్యక్తిగత జీవితాలపై నకిలీ వార్తలు, వీడియోలు వ్యాప్తి చేయడం ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది.
జగన్‌పై ఈగ వాలనివ్వని వైసీపీ సోషల్ మీడియా వింగ్ :
వీరికి అడ్డుకట్ట వేయడం, డిఫెండ్ చేసే క్రమంలో బాధితులు కూడా సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకుంటున్నారు. ఈ పరిస్ధితుల నేపథ్యంలో వైసీపీ ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా సైన్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ నేతలకు పెట్టని కోటలా రక్షణ కల్పిస్తోంది. రౌండ్ ది క్లాక్ గస్తీ కాస్తూనే ఉంటుంది. ఎవరైనా ఏమరపాటుగానైనా ఈ వైపు వచ్చారో వారి తోలు ఒలిచేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా అటాకింగ్ ధాటికి శత్రువులు సరెండర్ కావాల్సిందే. అలా వుంటుంది మరి ఎదురుదాడి. నిజానికి ఎవరైనా ఎదురుదాడి చేయాల్సిందే అనుకుంటే.. అవతలిపక్షంలో వున్నది ఎవరన్నది చూసుకుని బయల్దేరతారు కానీ వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు అదేం పట్టదు. తేడా వస్తే తాట తీయడమే.
దుష్ప్రచారం చేయించడంలో చంద్రబాబు మాస్టర్ :
రాజకీయాల్లో వ్యూహా ప్రతివ్యూహాలు సహజం. తన ప్రత్యర్ధులపై, వారి పార్టీ నేతలపై దుష్ప్రచారం చేయించి వారి ప్రతిష్టను మసకబార్చడం కామన్. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిది అందెవేసిన చేయి. టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా లేదంటే పెయిడ్ న్యూస్ ఇలా తనకు అందివచ్చిన ఏ అవకాశాన్ని ఆయన వదులుకోరు. ఈ క్రమంలో వారు గనుక దొరికిపోతే సైలెంట్ కావడం చంద్రబాబు స్టైల్. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు, సీఎం జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం నిమిత్తం పురమాయించిన స్వాతిరెడ్డి అడ్డంగా దొరికిపోవడంతో టీడీపీ-వైసీపీ సోషల్ మీడియా విభాగాల మధ్య ఓ మినీ యుద్ధమే నడిచింది. చివరికి ఈ విషయంలో చంద్రబాబు స్పందించడం , ఆ తర్వాత శ్వేతా చౌదరి అలియాస్ స్వాతిరెడ్డి సైలెంట్ కావడం తెలిసిందే.
వైసీపీ ఎదురుదాడికి సైలెంట్ అయిన శ్వేతా చౌదరి :
యూకేలో నివసిస్తున్నట్లుగా చెబుతోన్న స్వాతిరెడ్డి అలియాస్ శ్వేతా చౌదరి అనే టీడీపీ వీరాభిమాని గతకొంతకాలంగా సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి వివాదాస్పద పోస్టులు పెడుతున్నారు. కొన్ని మార్ఫింగ్ ఫోటోలను సైతం స్వాతి పోస్ట్ చేస్తున్నారు. ఇంతకాలం చూసిచూడనట్లుగా వదిలేసినా సీఎం జగన్, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె ప్రవర్తిస్తూ వుండటంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎదురుదాడికి దిగింది. విదేశాల్లో వుండటం వల్ల తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఇలా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతోందంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆరోపిస్తోంది. వీరికి వైసీపీ నేతలు, కార్యకర్తలు జతకలవడంతో అధికార పార్టీకి అదనపు బలం మారింది. దీంతో గతంలో వైఎస్ జగన్ , ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ స్వాతిరెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు , మార్ఫింగ్ చేసిన ఫోటోలను ఒక్కొక్కటిగా తవ్వి తీస్తూ.. స్వాతిరెడ్డి అసలు బండారం ఇదంటూ బయటపెట్టారు.
మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పించిన వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ :
ఇక.. తాజాగా మంత్రి రోజాకు బాసటగా నిలిచింది వైసీసీ సోషల్ మీడియా వింగ్. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆమె ఇటీవల బాలీవుడ్ నటి సన్నీలియోన్‌తో పోల్చడం దుమారం రేపింది. ఈ కామెంట్స్‌పై స్వయంగా సన్నీలియోన్ స్పందించినట్లుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. సన్నీలియోన్ అధికారిక ఖాతా నుంచి వచ్చినట్లుగా వున్న ఆ పోస్ట్‌ను నిజంగా ఆమె స్పందించారేమోనని అంతా భావించారు. సన్నీలియోన్ రోజాకు ఘాటుగా బదులిచ్చారంటూ ప్రచారం జరిగింది. ఇక్కడే వైసీపీ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగింది. అది ఫేక్ ట్వీట్ అని తేల్చుతూ వందలాది ట్వీట్స్‌తో ఎదురుదాడికి దిగింది. అప్పటికే మీడియాలో పలు కథనాలు వచ్చేశాయి. అలా ప్రముఖ ఇంగ్లీష్ వార్తాపత్రిక డెక్కన్ క్రానికల్ సైతం కథనం రాసి.. తర్వాత తప్పు తెలుసుకుని రోజాకు క్షమాపణలు చెప్పింది. రోజా గురించి ఓ ఫీచర్ స్టోరీలో తప్పుగా రాసినందుకు చింతిస్తున్నామంటూ డెక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ ట్వీట్ చేశారు. ఇదంతా వైసీపీ సోషల్ మీడియా విభాగం వల్లే సాధ్యమైంది.. వైసీపీ శ్రేణులు , నెటిజన్లు విరుచుకుపడటంతో డెక్కన్ క్రానికల్ దిగొచ్చి క్షమాపణలు చెప్పింది.
జగన్ జోలికొస్తే అంతే సంగతులు :
ఇప్పుడే కాదు.. గతంలో బీజేపీ పెద్దలు, ఇటీవల వాలంటీర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడిన పవన్ విషయంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి శరపరం పరంగా బాణాలు దూసుకొచ్చాయి. ఎవరైనా సరే జగన్ జోలికి గానీ, వైసీపీ జోలికి గానీ వచ్చారో నేలను నాకించేస్తారు. ఖండాంతరాల్లో వున్న, ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా వదిలేది లేదు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఏ ఫ్లాట్ ఫాం అయినా సరే అనుమానంగా కనిపిస్తే చాలు వాళ్లకు బతకు మీద విరక్తి కలిగించేస్తారు. మిమ్మల్ని కాపాడాలంటే మళ్లీ వైసీపీ సోషల్ మీడియానే కాపాడాలి. ఈ ఇబ్బందులన్నీ పడటం దేనికి అందుకే మర్యాద ఇచ్చి.. మర్యాద పుచ్చుకోండి.. ఎందుంటే అటుపక్క వున్నది వైసీపీ సోషల్ మీడియా వింగ్. సో.. అదన్న మ్యాటర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments