Nara Lokesh:నోరుజారిన ఫలితం : నారా లోకేష్‌పై విమర్శల వర్షం.. పోలీసులకు ఫిర్యాదుల వెల్లువ, వైసీపీ తేలిగ్గా వదలదు

  • IndiaGlitz, [Saturday,August 26 2023]

తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యింది. యాత్రకు జనాన్ని తోలుకురాలేక నేతలు చేతులెత్తేస్తున్నారు. ఇదంతా పక్కనబెడితే.. గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయడు, జగన్, షర్మిలకు భిన్నంగా లోకేష్ సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు రోడ్లపై తిరుగుతున్నారు. ఆయన తంతు చూసిన నేతలు సెటైర్లు వేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని అయితే అది యువగళమా.. గంగాళమా .. లోకేష్ చేస్తున్నది ఈవినింగ్ వాక్‌లా వుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాదయాత్ర ఎలా చేయాలో వైఎస్ వీడియోలు చూసి నేర్చుకోవాలంటూ హితవు పలికారు.

జనం దృష్టి పడేందుకు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు :

సొంతపార్టీ నేతలతో పాటు వైసీపీ నుంచి విమర్శలు వస్తుండటంతో తన పాదయాత్ర జనం ఫోకస్‌లో వుంచేందుకు లోకేష్ నోటికి పనిచెప్పారు. నామినేటెడ్ పోస్ట్ కావాలంటే పోరాడండి.. కొట్లాడండి అంటూ కేడర్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఈ విషయంలో ఎవరైతే రెచ్చిపోతారో, ఎక్కువ విధ్వంసం చేస్తారో వాళ్లకు ఖచ్చితంగా ప్రాధాన్యతనిస్తానని లోకేష్ బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఒక పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో వుండి, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ యువకిశోరంగా, ఆ పార్టీకి భావి సారథిగా జనం చెప్పుకుంటున్న లోకేష్ తన స్థాయి మరిచి ఇలా ప్రవర్తించడం ఏంటంటూ మండిపడుతున్నారు.

లోకేష్‌పై వైసీపీ సోషల్ మీడియా విభాగం ఫిర్యాదులు :

వైసీపీ సోషల్ మీడియా విభాగం ఒక అడుగు ముందుకు వేసి లోకేష్‌ను కట్టడి చేయాలని నిర్ణయించింది. హింసను ప్రేరేపించేలా మాట్లాడిన లోకేష్‌‌పైనా, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రాజకీయాలంటే సేవాభావంతో వుండాలని.. అలాంటిది ఎవరి మీదనైతే ఎక్కువ కేసులు వుంటాయో వారికే పదవులు ఇష్తామంటూ లోకేష్ వ్యాఖ్యానించడం బాధాకరమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఆయన ఎలాంటి సందేశం ఇస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ కేసులున్న వారికే పదవులు ఇస్తామని చెబుతున్న నారా లోకేష్‌పై చివరికి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలతో భారీ విధ్వంసం:

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్ట్‌‌ల విధ్వంసం అంటూ ఆనాడు రెచ్చగొట్టినందునే తంబళ్లపల్లె, పుంగనూరు, మాచర్ల వంటి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారని దీనికి టిడిపి నాయకత్వమే కారణమని ఆరోపిస్తున్నారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లోకేష్ ప్రకటనలు ఉంటున్నాయని, ఈ నేపథ్యంలో అయన మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో లోకేష్‌పై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికైనా పాదయాత్రను సజావుగా నిర్వహించుకోవాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానీ.. తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో ప్రజలకు తెలియజేయాలని వైసీపీ నేతలు హితవు పలుకుతున్నారు.