సామాజిక సాధికారిత ఆధారంగా వైసీపీ కొత్త ఇంఛార్జ్‌ల ప్రకటన
- IndiaGlitz, [Wednesday,January 03 2024]
త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపడుతోంది. సామాజిక సాధికారతే ధ్యేయంగా అన్ని కులాల వారికి సీఎం జగన్ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇప్పటికే 11 మంది కొత్త ఇంఛార్జ్‌లను ప్రకటించిన అధిష్టానం.. తాజాగా 27 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమంది సిట్టింగ్‌లను మార్చగా.. మరికొంతమంది వారసులకు చోటు కల్పించారు. అలాగే మూడు ఎంపీ స్థానాలకు కొత్త అభ్యర్థులను నియమించారు. అనంతపురం ఎంపీగా శంకరనారాయణ, హిందూపురం ఎంపీగా శాంతమ్మ, అరకు ఎంపీగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిలను ఎంపిక చేశారు.
యువతకు తొలి అవకాశం..
ఇక రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్‌కు స్థాన చలనం చేశారు. అలాగే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్‌కు ఛేంజ్ చేశారు. ఇక యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డికి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి, మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, రామచంద్రాపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ వారసుడు పిల్లి సూర్యప్రకాష్‌లకు టికెట్ కేటాయించారు.
ఓసీ, మైనార్టీలకు తగిన ప్రాధాన్యత..
కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ పిఠాపురం నుండి వంగ గీత,జగ్గంపేట నుండి తోట నరసింహం,ప్రత్తిపాడు నుండి వరుపుల సుబ్బారావులకు అవకాశం కల్పించగా.. మైనార్టీలకు కూడా ప్రాధాన్యత నిస్తూ విజయవాడ వెస్ట్ నుండి షేక్ ఆసిఫ్, గుంటూరు ఈస్ట్ నుండి షేక్ నూరి ఫాతిమా, కదిరి నుండి బియస్.మక్బూల్ అహ్మద్‌లకు చోటు కల్పించారు. వైశ్య సామాజికవర్గం నుండి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అవకాశమిచ్చారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకూ సమ ప్రాధాన్యం..
ఇక ఎస్పీ సామాజికవర్గం స్థానాలైన పాయకరావు పేట నుండి కంబాల జోగులు, పి.గన్నవరం నుండి విప్పర్తి వేణుగోపాల్, ఎర్రగొండపాలెం నుండి తాటిపర్తి చంద్రశేఖర్.. ఎస్టీ సామాజికవర్గం స్థానాలైన అరకు ఎంపీ స్థానానికి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మిలకు అవకాశం కల్పించారు. బీసీల కోటాలో మార్గాని భరత్, మలసాల భరత్ కుమార్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పిల్లి సూర్యప్రకాష్‌లకు అవకాశం కల్పించారు.
చేతల్లో చూపించిన సీఎం జగన్..
మొదటి జాబితాలో 11 మంది కొత్త ఇంఛార్జ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన 27 మందితో కలిపి మొత్తం 38 మంది కొత్త ఇంఛార్జ్‌లను అధిష్టానం నియమించింది. ఈ రెండు జాబితాల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించి మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఈ ఇంఛార్జిల ఎంపిక చేపట్టారు. సీఎం జగన్ తరచూ చెప్పే సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపించారు. అలాగే కొన్ని రాజకీయ కారణాల వల్ల స్థానం కోల్పోయిన నేతలను నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారి సేవలను పార్టీకి వినియోగించుకోనున్నట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు.