సెర్బియాలో పోలీసులకు పట్టుబడ్డ నిమ్మగడ్డ.. రంగంలోకి వైసీపీ ఎంపీలు!

  • IndiaGlitz, [Tuesday,July 30 2019]

ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, తెలుగు రాష్ట్రాల ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌‌కు సెర్బియా పోలీసులు షాకిచ్చారు. విహారయాత్ర కోసం సెర్బియాకు వెళ్లిన నిమ్మగడ్డను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా వాన్‌పిక్ వ్యవహారంలో ఈయన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ వ్యహారంలో ‘రస్ అల్ ఖైమా’కు చెందిన ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని బెల్‌గ్రేడ్‌లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేసింది. కాగా ఈ వాన్‌పిక్‌కు సంబంధించిన కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం విదితమే. తీర ప్రాంతాల అభివృద్ధి పేరుతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వాన్‌పిక్ ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో భూ సేకరణ జరిగిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై పలు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో పాటు మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయి 16 నెలలపాటు జైలులో గడిపారు.

రంగంలోకి దిగిన వైసీపీ..!

నిమ్మగడ్డకు వైసీపీ అధినేత మంచి సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుసుకున్న వైసీపీ ఎంపీలు రంగంలోకి దిగారు. సెర్బియా నుంచి ఆయన్ను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. సెర్బియాతో సంప్రదింపులు జరపి నిమ్మగడ్డను అరెస్ట్ చేయకుండా సురక్షితంగా ఇండియాకు తరలించేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ వ్యవహారంపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.

అసలేంటి ఈ వాన్‌పిక్ కేసు!?

‘వాడ్రేవ్ అండ్‌ నిజాంపట్నం ఇండస్ట్రియల్‌ కారిడార్‌’... దీనినే సంక్షిప్తంగా ‘వాన్‌పిక్‌’ అని పిలుస్తారు. తీర ప్రాంత అభివృద్ధి పేరిట దివంగత సీఎం వైఎస్ హయాంలో 2005-2006లో వాన్‌పిక్‌ కోసం భూ సేకరణ చేపట్టడం జరిగింది. ఇందుకుగాను గుంటూరు, ప్రకాశం జిల్లాలో దాదాపు 29 వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఎకరానికి గరిష్ఠంగా రూ.90 వేల నుంచి లక్షన్నర మాత్రమే ఇచ్చారని, ప్రజల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా బెదిరించి మరీ భూములు లాక్కున్నారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ‘వాన్‌పిక్‌’ ప్రాజెక్టు ముందస్తు అంచనాలతో చాలా మంది నేతలు ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వాటిలో చాలావరకు అసైన్డ్‌ భూములు కూడా ఉన్నాయి. అలా సేకరించిన భూములను నాటి ప్రభుత్వం కొంతమంది పారిశ్రామికవేత్తలకు కేటాయించింది. అయితే ఇన్ని వేల ఎకరాల భూమి సేకరించినా వాన్‌పిక్‌ ప్రాజెక్టు మాత్రం అంగుళం కూడా కదల్లేదు. దీంతో పలువురు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదుచేసి.. నాడు వైఎస్ జగన్‌తోపాటు మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుమారు 16 నెలలకు పైగా జైలులోనే గడిపిన విషయం విదితమే.