రాష్ట్రంలో వర్షాభావ పరిస్ధితులు .. ఆ రెండు పాదాల మహిమే : ఎంపీ అవినాష్ రెడ్డి సెటైర్లు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయి. ఆగస్ట్ పోయి సెప్టెంబర్ వస్తున్నా నేటికి సరైన వర్షాలు లేవు. ఎల్ నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో జూన్‌లో లోటు వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత పరిస్ధితులు చక్కబడి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు పోటెత్తాయి. కానీ ఆగస్ట్‌లో అస్సలు వర్షాలు పడలేదు. అయితే ఏపీలో వర్షాభావ పరిస్ధితులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లే కారణమంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. రెండు బలమైన పాదాల వల్లే రాష్ట్రంలో వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్, జగన్‌ల హయాంలో మంచి వర్షాలు :
బుధవారం కడప జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లెలో ఎండిపోయిన వేరుశెనగ పంటను అవినాశ్ పరిశీలించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా అవసరానికి మించి వర్షాలు పడ్డాయని వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పాలనలో అవసరమైన మేర వర్షాలు కురిశాయని.. కానీ ఇప్పుడు మాత్రం కురవడం లేదనే చర్చ ప్రజల్లో జరుగుతోందని అవినాశ్ రెడ్డి చెప్పారు. అయితే రెండు బలమైన పాదాలు తమ మధ్యకు రావడం వల్లే వర్షాలు కురవడం లేదని జనం చెబుతున్నారని ఎంపీ పేర్కొన్నారు.
తండ్రీ కొడుకులిద్దరూ జిల్లాకు :
ఈ రెండింటిలో ఒకటి చంద్రబాబుదని.. రెండోది ఆయన కుమారుడు నారా లోకేష్‌దన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌లపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు.. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ కడప జిల్లాకు వచ్చారని అవినాష్ రెడ్డి గుర్తుచేశారు. వీరిద్దరూ మన మధ్యకు రావడం వల్లే తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయని.. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోందని రైతులు చెబుతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్‌లో వేల ఎకరాల్లో వేరుశెనగ పంట సాగు చేశారని.. 60 రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంట దెబ్బతిందని అవినాష్ రెడ్డి చెప్పారు. నష్టపోయిన పంటల వివరాలను ఈ క్రాప్ చేయించి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం వచ్చేలా కృషి చేస్తామని ఎంపీ రైతులకు హామీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout