YS Jagan:దటీజ్ జగన్ .. బాపట్ల బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం , గంటల్లోనే ఇంటికొచ్చిన చెక్
Send us your feedback to audioarticles@vaarta.com
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో పదో తరగతి చదువుతున్న బాలుడు అమర్‌నాథ్‌ను పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ, రేపల్లె నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మోపిదేవి వెంకట రమణ తెలిపారు. తాము బాధితులను పరామర్శించి వచ్చిన నాలుగైదు గంటల వ్యవధిలోనే రూ. 10 లక్షల చెక్కును పంపారని పేర్కొన్నారు. ఇది జగన్ నిబద్ధతకు, బాధల్లో ఉన్న ప్రజల పట్ల స్పందించిన తీరుకు నిదర్శనమని ఎంపీ ప్రశంసించారు. బాలుడు హత్యకు గురికావడం తమను ఎంతో కలచివేసిందని.. ఈ హత్యకు పాల్పడిన నలుగురిలో ముగ్గురిని 24 గంటలు తిరగకుండానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మోపిదేవి చెప్పారు. మరో నిందితుడిని కూడా కొద్దిగంటల్లోనే పోలీసులు పట్టుకుంటారని వెంకట రమణ చెప్పారు.
టీడీపీవి నీచ రాజకీయాలు :
ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించానని.. పార్టీలు, కులాలతో సంబంధం లేకుండా మానవత్వంతో తన వంతుగా రూ.లక్ష సాయం చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. దీంతోపాటు బాధిత కుటుంబ సభ్యులు అడిగిన మేరకు వారి ఇళ్ల స్థలంతోపాటు ఇంటిని కట్టించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని వెంకట రమణ తెలిపారు. మరోవైపు.. ఈ ఘటనపై రాజకీయం చేస్తున్న విపక్షాలపై ఎంపీ ఫైర్ అయ్యారు. బాధిత కుటుంబం కుమారుడిని కోల్పోయి బాధల్లో ఉంటే ఓదార్చాల్సింది పోయి వారిని రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకురావడం టీడీపీ నీచ రాజకీయాలకు నిదర్శమని మోపిదేవి మండిపడ్డారు.
నిందితులను పట్టుకున్నా పట్టుకోలేదని వార్తలు :
నిందితులను గంటల్లోనే పట్టుకున్నా ఎల్లో మీడియాలో నిందితులను పట్టుకోలేదని వార్తలు రాయడం దుర్మార్గమన్నారు. ఈ ఘటనకు ఎలాంటి రాజకీయం, కుల నేపథ్యం లేకపోయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్.. చంద్రబాబు డైరెక్షన్‌లో కుల, శవ రాజకీయాలు చేస్తున్నరని వెంకట రమణ ఆరోపించారు. వెన్నుపోటుతో పైకి వచ్చిన చంద్రబాబుకు కులాల మధ్య చిచ్చుపెట్టడం, ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అల్లర్లు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు చేతనైతే సాయం చేయాలని, అంతేకానీ ఇక్కడ కూడా రాజకీయాలు చేసి ఓట్లు రాబట్టుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు.
అక్కను వేధిస్తున్నాడని ప్రశ్నించినందుకు దారుణం:
కాగా.. హత్యకు గురైన ఉప్పల అమర్‌నాథ్ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ప్రతిరోజూ ఉదయం రాజోలులో ట్యూషన్‌కు వెళ్తున్నాడు. యథావిధిగా శుక్రవారం కూడా ట్యూషన్‌కు వెళ్తుండగా.. మార్గమధ్యంలో అడ్డుకున్న నిందితులు బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు అంటుకోవడంతో అమర్‌నాథ్ గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను అర్పివేసి.. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అమర్‌నాథ్ ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయేముందు వెంకటేశ్వర్ రెడ్డే ఇదంతా చేసినట్లు బాలుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తన అక్కను వేధిస్తున్నందుకు నిలదీశాడనే కోపంతోనే వెంకటేశ్వర్ రెడ్డి తన మిత్రులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments