చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు: వైసీపీ ఎమ్మెల్యే

  • IndiaGlitz, [Sunday,April 21 2019]

ఈవీఎంలు పనిచేయలేదు.. ఈవీఎంలపై నమ్మకం లేదని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం అది ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తిగా చరిత్రలోనే నిలిచిపోతారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెలో ఆదివారం శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సాయంకాలం 6 గంటలకే 99.5 శాతం పోలింగ్ పూర్తిగా నమోదు అయ్యిందని చంద్రబాబు మాత్రం 33 శాతం ఈవీఎంలు పని చేయలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉంటూ ఉదయాన్నే ఓటర్లను వెనక్కి పంపే ఆలోచన చేసి పచ్చ మీడియాలో చూపించడం ఆయన ఓటమికి ఆయనే పునాది వేసుకోవడం అయ్యిందన్నారు.

బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు!

రాష్ట్రంలో 49 వేల 9 వందల 60 పోలింగ్ బూత్‌లు ఉండగా కేవలం అనంతపురం జిల్లాలో ఒక్క పోలింగ్ బూత్‌లో మాత్రమే తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగింది. ప్రజాభిప్రాయం తనకు అనుకూలంగా లేదనే కారణంతో నా ఓటు ఎక్కడికి పోయిందో నాకే తెలియదు అని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అనడంతో ప్రజలను అవమానించబడడమే. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలను రేకెత్తించిన చంద్రబాబు ఏ పాటి వ్యక్తి అనేది అర్థం చేసుకోవాలి. కడప పర్యటనకు వచ్చిన చంద్రబాబు ప్రజలు తీవ్ర కరువుతో అల్లాడుతుంటే కరువు, తాగునీటి సమస్యపై సమీక్ష నిర్వహించాల్సింది పోయి ఎన్నికల కమిషన్‌పై సమీక్షలు నిర్వహించండి తమ్ముళ్లు అనడం హేయమైన చర్య. దేశ రాజకీయలల్లో ఈవీఎంలపై రగడ చేసి తాను ఏదో సాధించాలనుకోవడంపై ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.