చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఛాలెంజ్
- IndiaGlitz, [Sunday,April 07 2019]
ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు తానే అభ్యర్థిని అని.. తనను చూసి సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెబుతూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి ప్రకాశం జిల్లా చీరాలలో బాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అంతేకాదు ఆమంచి ఓ నేరస్థుడు.. ఆయనపై 28 కేసులు ఉన్నాయని కూడా ఎద్దేవా చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు ఆమంచి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.
చంద్రబాబుకే సవాల్..
ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమంచి.. ఏకంగా చంద్రబాబుకే సవాల్ విసిరారు. చీరాల నియోజవకర్గంలో టీడీపీకి 30వేల నుంచి 40 వేల ఓట్లు కూడా రావని జోస్యం చెప్పారు. అంతటితో ఆగని ఆయన తాను 40వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమాగా చెప్పుకున్నారు. తన కేసులు గురించి మాట్లాడిన చంద్రబాబు పై 19 కేసులు ఉన్నాయన్న విషయం మరిచిపోవద్దని.. ఈ సందర్భంగా ఆమంచి గుర్తు చేశారు. ప్రజల కోసం.. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే తనమీద కేసులు నమోదు చేశారు తప్ప, మరే నేరాలు ఘోరాలు తనపై నమోదు కాలేదని ఆమంచి స్పష్టం చేశారు.
నేనొక్కడినే..
బాబుకు సిగ్గు వుంటే వాన్ పిక్ పై మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ అంశంపై ఆయన ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. ఏపీలోని 175 నియోజకవర్గాలలో అతి తక్కువ నిధులు చీరాలకు కేటాయించారు. రాష్ట్రంలో ఇండిపెండెంట్ హౌస్లు నేను మాత్రమే కట్టించాను. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా కట్టించలేదు అని ఆమంచి చెప్పుకొచ్చారు. కాగా చీరాల నుంచి వైసీపీ తరఫున ఆమంచి పోటీ చేస్తుండగా.. టీడీపీ తరఫున కరణం బలరామకృష్ణమూర్తి పోటీ చేస్తున్న విషయం విదితమే.