YV Subba Reddy:చంద్రబాబుపై కక్ష సాధించాలనుకుంటే నాలుగేళ్లు ఆగుతామా : వైవీ సుబ్బారెడ్డి
- IndiaGlitz, [Sunday,September 10 2023]
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై విపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై కక్ష సాధించాలని అనుకుంటే నాలుగేళ్లు అవసరమా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే రివేంజ్ తీర్చుకునేవాళ్లమని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన నిధుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జగన్ అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. షెల్ కంపెనీలకు నగదు మళ్లించి అవినీతికి పాల్పడిన వ్యవహారాన్ని ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
చట్టానికి ఎవరూ అతీతులు కారని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైవీ చెప్పారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామని, ఆయనను అదుపులోకి తీసుకుంటే ప్రజల నుంచి కనీస స్పందన లేదన్నారు. దీనిని బట్టి ప్రజలకు చంద్రబాబుపై ఎంత కోపమో తెలుస్తోందన్నారు. న్యాయస్థానం ఆయనకు సరైన శిక్ష విధిస్తుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాలతోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం జరిగిందన్నారు. చేతికి వాచ్ లేదని చెప్పుకునే చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టుకున్నారంటూ ఆయన చురకలంటించారు. అధికారులు ఎంత చెప్పినా పట్టించుకోకుండా చంద్రబాబు ఈ కుంభకోణానికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. కక్ష సాధించాలని తమ ప్రభుత్వం అనుకుని వుంటే ఇంతకాలం ఆగేవాళ్లం కాదన్నారు. సీఐడీ విచారణలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం మొత్తం బయటపడిందని వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్నో స్కాంలు చేసిన చంద్రబాబును వదిలి పెట్టాలా అని మంత్రి ప్రశ్నించారు.