Gurudatta Prasad:కాపులను శాసించే అధికారం పవన్‌కు లేదు .. నీ కన్నా చిరంజీవి ఎంతో బెటర్ : మేడా గురుదత్త ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు తగ్గడం లేదు. టీడీపీతో జనసేన పొత్తును ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు జనసేనను వీడారు. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాల్లో మంచి పట్టున్న మేడా గురుదత్త ప్రసాద్ కొద్దిరోజుల కిందట జనసేనను వీడి వైపీపీలో చేరారు. ఈ క్రమంలో గురుదత్త ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్‌కి కాపులని శాశించే అధికారం లేదని.. కాపు ఆశయాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఉన్నారని మండిపడ్డారు. చంద్రబాబు పల్లకీ మోయడానికి కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావంటూ మేడా ఫైర్ అయ్యారు. ప్రతి రాజకీయ నాయకుడు తన పార్టీ, తన నాయకులు ఎదగాలని కోరుకుంటారు కానీ.. దేశంలో ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం 'పక్క పార్టీ నాయకులు' ఎదగాలని కోరుకుంటారని దుయ్యబట్టారు. రాష్ట్రం బాగు కంటే తనకి ఏ పదవి ముఖ్యం కాదని పవన్ పదే పదే అంటున్నారని.. పదవి అవసరం లేదని ఎవరితో చర్చించి చెప్పారని గురుదత్త ప్రసాద్ ప్రశ్నించారు.
నారా లోకేష్, చంద్రబాబు నిర్ణయం సరిపోతుంది అనుకుంటే, నీ వెనకాల నీ పార్టీను నమ్ముకుని తిరిగిన జనసైనికుల పరిస్థితి ఏంటి..? నీ వెంట నడిచిన కాపు నాయకుల సంప్రదింపులు నీకు అవసరం లేదా అని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఒక్కసారి వీర మరణాలు అవసరం లేదు అంటావ్..మరో సారి అధికారమే వద్దు అంటావ్..మరి ఎం చూసి నీ వెంట కాపులు నడవాలని వారి ఆశయాలకు సాధకుడిగా నిన్ను, నీ పార్టీ జెండాని ఎత్తుకుంటే నువ్వు మాత్రం 'నాకు ఎటువంటి ఆశలు లేవు అని, నీ వెంట నడిచిన వారి గౌరవాన్ని మంటలో కలిపేస్తావ్'. దీన్ని సహించలేకే హరిరామ జోగయ్య గారి లాంటి కాపు నాయకులు మండిపడ్డారు .
పొత్తుని సమర్ధించని వారిని వైఎస్సార్సీపీ కోవర్టులని అన్నావు.. మరి ఎవరితో సంప్రదించకుండా కాపుల కోరికలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోలేదని దుయ్యబట్టారు. 2018లో నువ్వే అనేకసార్లు వాళ్లని నమ్మకూడదని చెప్పి ఈ రోజు లోకేష్, చంద్రబాబులని ఆకాశానికి ఎత్తడంపై కాపులకి సమాధానం చెప్పాలని గురుదత్త ప్రసాద్ డిమాండ్ చేశారు. అమ్మ ఎవరికైనా అమ్మే, ఆరోజు చంద్రబాబు ఎల్లో మీడియా మీ ఇంట్లో వారిని సోషల్ మీడియాలోకి లాగి అవమానిస్తే ట్విట్టర్ ద్వారా స్పందించానని గుర్తుచేశారు. అలాంటిది మీరు కాపులని మరోసారి వాళ్ళని నమ్మండి అని ఎలా అడుగుతున్నారని మేడా గురుదత్త ప్రసాద్ ప్రశ్నించారు.
10 ఏళ్ల రాజకీయ నేతగా ఎదిగిన నీకన్నా మీ అన్న చిరంజీవి ఎంతో మేలు.. తాను కనీసం కాపు నాయకులని రాష్ట్రానికి అందించారని ప్రశ్నించారు. నీ పార్టీ ద్వారా నువ్వు ఎందరిని నాయకులుగా తయారు చెయ్యగలిగావని నిలదీశారు. నిలిచి గెలుస్తామనే సత్తా ఉన్నవారికి పొత్తులో భాగంగా ఇప్పుడు టీడీపీ టికెట్ అడిగితె ఇచ్చేస్తావంటూ గురుదత్త ప్రసాద్ ఎద్దేవా చేశారు. నాకు ఓటు వేసి జనసేనని గెలిపించండి అని అనాల్సిన సమయంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వెయ్యండి అని అడుక్కునే పరిస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారని ఆయన దుయ్యబట్టారు. సంక్షేమంలో ఒక వైపు .. అభివృద్ధిలో మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ దేశంలో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. అలాంటిది పవన్ ఇంత అమాయకంగా, వారిని నమ్మడమే కాకుండా, కాపులని మీ వెంట రమ్మని అడగటం ఎంతో అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. - అందు చేత కాపులంతా జగన్ వైపే ఉంటారని పవన్ కళ్యాణ్ గమనించాలని గురుదత్త ప్రసాద్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments