YS Jagan:జగన్ పాలనపై పచ్చి అబద్ధాలు : చిన్నమ్మ .. మీ స్థాయికి ఇది తగునా, వాస్తవాలు తెలుసుకోవమ్మా..?

  • IndiaGlitz, [Thursday,July 20 2023]

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చిన్నమ్మ పురందేశ్వరి స్పీడ్ పెంచారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమెకు పదవి దక్కింది. నాలుగేళ్లుగా వీర్రాజు చేయలేనిది తాను చేసి చూపిస్తాను అన్నట్లుగా పురందేశ్వరి తీరు వుంది. అందరినీ కలుపుకుంటూ పోవాలని .. తన సత్తా ఏంటో చూపించాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇందుకోసం ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం పురందేశ్వరి స్ధాయికి తగదు. అధికారంలో వున్న వాళ్లపై ఆరోపణలు చేస్తేనే ప్రతిపక్షాలకు మైలెజ్ వస్తుంది. కానీ వాటికి తగిన ఆధారాలు కూడా వుండాలి. ఇప్పుడు ఈ రెండో విషయంలో చిన్నమ్మ ఫెయిల్ అయ్యారు.

జగన్ పాలనలో రూ.7.14 లక్షల కోట్లు అప్పులు : పురందేశ్వరి

మంగళవారం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలారు. గడిచిన నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.7.14 లక్షల కోట్ల మేర అప్పులు చేసినట్లు చిన్నమ్మ ఆరోపించారు. ఇందులో అనధికార అప్పులే రూ.4 లక్షల కోట్లకు పైగా వున్నాయని.. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఏపీలో వున్నన్ని కోర్ట్ ధిక్కార కేసులు ఏ రాష్ట్రంలోనూ లేవని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంపై మొత్తం రూ.10.77 లక్షల కోట్ల అప్పు ఉందని.. రాష్ట్ర విభజన నాటికి రూ.97 వేల కోట్ల రుణం ఉందని పురందేశ్వరి చెప్పారు. 2014-2019 మధ్యలో టీడీపీ ప్రభుత్వం రూ.2,65,365 కోట్లు అప్పులు చేస్తే.. వైసీపీ వచ్చాక అనధికారికంగా రూ.4,74,315 కోట్ల అప్పు చేసిందని ఆమె పేర్కొన్నారు.

ఆదాయంలో 40 శాతం వడ్డీలకే : పురందేశ్వరి

కలెక్టరేట్లతో సహా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్ర భవిష్యత్తును సర్వ నాశనం చేశారని , దీనిపై కేంద్రానికి రాష్ట్ర బీజేపీ ఫిర్యాదు చేస్తుందని పురందేశ్వరి తెలిపారు. రాష్ట్రానికి వివిధ రూపాల్లో రూ.90 వేల కోట్ల ఆదాయం వస్తోందని.. మోదీ ప్రభుత్వం పన్నుల వాటా శాతాన్ని పెంచి ఆంధ్రప్రదేశ్‌కు రూ.35 వేల కోట్లు ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. అలా మొత్తం రూ.1.25 లక్షల కోట్ల ఆదాయం వస్తే... ఇందులో 40 శాతం సొమ్ము అప్పులపై వడ్డీలకే సరిపోతోందని పురందేశ్వరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ , వైఎస్ జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేయడం ద్వారా తాను ప్రత్యేకమైన నాయకురాలినని గుర్తింపు పొందేందుకు చిన్నమ్మ తహతహలాడుతున్నారు. కానీ వాస్తవాలు కప్పిపుచ్చేలా మాట్లాడటంతో ఆమెపై వైసీపీ నుంచి ఎదురుదాడి స్టార్ట్ అయ్యింది. వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా ఆమెపై కౌంటర్లు వేస్తున్నారు. మరి పురందేశ్వరి చెప్పినదానితో వాస్తవాలను ఒకసారి పొంతన చూస్తే.

వాస్తవాలు గమనిస్తే :

రాష్ట్ర విభజననాటికి ఉన్న అప్పు : 1,32,079 కోట్లు అయితే.. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి వున్న రుణం 3,31,054 కోట్లు (వార్షిక పెరుగుదల 20. 17 శాతం ). జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో అంటే 2023 మార్చ్ నాటికి రాష్ట్ర అప్పులు 5,87,317 కోట్లు ( 16.13 శాతం ). రాష్ట్ర విభజననాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు 1,53,346 కోట్లుగా వుంటే టీడీపీ దిగిపోయేనాటికి ఉన్న అప్పులు 4,12,288 కోట్లు ( వార్షిక పెరుగుదల 21.87 శాతం). జగన్ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో అంటే 2023 మార్చి నాటికి ఈ విభాగంలో వున్న అప్పులు 6,51,789 కోట్లు .

జగన్ అప్పులు తక్కువేనన్న కాగ్ :

ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనతో పోలిస్తే జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువే అని కాగ్ చెబుతోంది. అదే సమయంలో మూలధన వ్యయం చాలా ఎక్కువ అని పేర్కొంది. టీడీపీ హయాంలో ఐదేళ్ళలో రూ. 76,139 కోట్లు ఖర్చు చేశారు.. అంటే సరాసరి ఏడాదికి రూ.15,225 కోట్లు కాగా జగన్ వచ్చాక నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు ఖర్చు చేశారు. అంటే సరాసరి ఏడాదికి రూ.18,852 కోట్లు . ఈ మొత్తాన్ని సామాజిక ఆస్తుల పెంపునకు ఖర్చు చేసినట్లు లెక్క .

రోడ్ల విషయంలోనూ జగన్ భేష్ :

ఇక జగన్ ప్రభుత్వం ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోపణ రోడ్ల పరిస్థితి. దీనిపై పురందేశ్వరి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఒకసారి వాస్తవాలు గమనిస్తే.. తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్లకు పెట్టిన ఖర్చు రూ.3,160 కోట్లు. అదే జగన్ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో రోడ్లకు పెట్టిన ఖర్చు రూ.4,493 కోట్లు . ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదని కూడా పురందేశ్వరి ఆరోపించారు. దీనిని గమనిస్తే.. బిజెపి పాలనలో వున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బిల్లు రూ.23,997 కోట్లు ( 2021-22 ఏప్రిల్ - అక్టోబర్ వరకు ) అయితే , గుజరాత్‌లో రూ.7,789 కోట్లుగా వుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఇది రూ.24,681 కోట్లు. జగన్ ప్రభుత్వం 2018–19లో ఉద్యోగుల జీతాలు,పెన్షన్ల చెల్లింపుల కోసం రూ.53,811 కోట్లు ఖర్చు చేయగా.. 2020-21లో రూ.66,470 కోట్లుగా వుంది.

అప్పులు కడుతూ.. సంక్షేమాన్ని విస్మరించని జగన్ :

చుట్టూ ఇన్ని సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఆర్ధిక పరిస్ధితి అధ్వాన్నం, చంద్రబాబు వదిలేసి వెళ్లిన జెన్ - కో బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు జగన్. అలాగే తాను ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రజలకు వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.2.20 లక్షల కోట్లను జమ చేశారు వైఎస్ జగన్. కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినా ఏక్కడా ఏ పథకమూ ఆగలేదు.. ఏ వర్గమూ ఇబ్బంది పడలేదు. మరి ఇవి పురందేశ్వరికి కనిపించలేదా. మొత్తంగా చూస్తే.. చిన్నమ్మ లెక్కల్లో, వాదనలో తెలుగుదేశం స్వరమే కనిపించింది. చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాలో ఇంతకాలం జగన్‌పై ఏవైతే ఆరోపణలు చేస్తూ వచ్చారో పురందేశ్వరి కూడా వాటినే టచ్ చేసినట్లుగా అనిపించకమానదు. మరి ఆమె నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పుంజుకుంటుందా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

More News

Pawan Kalyan:పీఆర్పీ విలీనం .. పవన్ పొలిటికల్ ఫెయిల్యూర్‌కు సాకు దొరికిందిగా, ఇక్కడా ‘‘అన్న’’ను వాడాల్సిందేనా..?

తన కష్టంతో , ఒక్కో మెట్టు పేర్చుకుంటూ , తను ఎదిగి, తెలుగు సినిమాను అగ్రస్థానంలో నిలబెట్టారు మెగాస్టార్ చిరంజీవి.

Samantha:ధ్యానం సింపుల్ .. బట్ పవర్‌ఫుల్ , ఇవాళే అర్ధమైంది :  సమంత మెడిటేషన్ ఫోటోలు వైరల్

గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అగ్ర కథానాయిక సమంత.

Rana Daggubati : ‘‘హిరణ్య కశ్యప’’గా రానా .. సీన్‌లోకి త్రివిక్రమ్ , టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్

దగ్గుబాటి రానా.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో. తాత, తండ్రి, బాబాయ్‌ల వారసత్వాన్ని నిలబెడుతున్నాడు.

Minister RK Roja:దళపతి కాదు.. దళారి, చంద్రబాబు కోసమే ఎన్డీయే సమావేశానికి : పవన్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఎన్డీయే సమావేశం, ఢిల్లీ పర్యటనపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.

Mystery:మిస్టరీగా అవనిగడ్డ ‘‘కారు’’ కేసు : ముదినేపల్లికి వెళ్లాల్సిన వ్యక్తి.. చోడవరం ఎందుకు, ఆ అర్ధరాత్రి ఏం జరిగింది..?

కృష్ణా జిల్లా చోడవరం వద్ద కరకట్ట కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.