ఈ వైసీపీ అభ్యర్థికి ఏమైంది.. ఎందుకీ వింత ప్రవర్తన!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఉన్నట్టుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోడ్డుపైకి వచ్చి వింతగా ప్రవర్తించారు..? ఆయన ప్రవర్తనతో విసిగిపోయిన జనాలు ఈయనేంట్రా బాబు ఇలా తయారయ్యారు..? ఇంతకీ ఈయనకు ఏమైంది అంటూ జనాలు ఒకింత ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ వైసీపీ అభ్యర్థి ఎవరు..? ఎందుకిలా ప్రవర్తించారనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలిచిన వరప్రసాద్.. ఈ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా గూడురు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకూ ఎన్నికల ప్రచారంలో బాగా పాల్గొని కచ్చితంగా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేసిన ఆయన.. సడన్‌గా ఏం జరిగిందో గానీ.. రోడ్డుపైకి వచ్చి జనాలను బెంబేలెత్తించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన గూడూరులోని దొమ్మలపాళ్యం వద్ద ఈ నెల 27న చోటుచేసుకుంది.
వీడియోలో ఏముంది..?
‘ఒక కోటీ ఇరవై రెండు లక్షలు.. హహ్హహ్హ.. ఒక కోటీ ఇరవై రెండు లక్షలు’.. (గుండెలు బాదుకుంటూ) ఇప్పటి వరకు ఎవరైనా నాలా చేశారా?.. మొత్తంగా 40 పనులు చేయించా.. కోటీ ఇరవై రెండు లక్షలు ఇక్కడ ఇచ్చానని, గూడూరులో 40 లక్షలు ఇచ్చాను" అని వరప్రసాద్ బిగ్గరగా అరుస్తూ చెప్పుకొచ్చారు. బిగ్గరగా అరుపులు వినపడటంతో ఇళ్లలో నుంచి జనాలు బయటికి వచ్చారు. జనాలు చూసే సరికి మరింత సౌండ్ పెంచిన ఆయన.. మరోసారి అరవసాగారు. దీంతో అసలేం జరుగుతోందో తెలియక జనాలు విస్తుపోయినంత పనైంది. అంతటితో ఆగని ఆయన రోడ్డున పోయే వారిని పట్టుకుని ఎంపీగా ఆయనేం చేశారో ఆ లెక్కలన్నీ చెబుతుండటంతో అసలు ఈయనకు ఏమైందిరా బాబూ అంటూ రోడ్డున వెళ్లే జనాలు తలలు పట్టుకున్నారు. మరికొందరు ‘స్వామీ మమ్మల్ని వదిలిపెట్టండి’ అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఆయన దగ్గరికి రావడానికి మీడియా ప్రతినిధులు సైతం జంకారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేస్కోండి.
సడన్‌గా ఎందుకిలా..!?
గతంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చి పీఆర్పీ తరఫున బరిలో నిలిచారు. ఆ తర్వాత తిరుపతి వైసీపీ ఎంపీగా గెలిచారు. అయితే ఈ రేంజ్ ఉన్న వరప్రసాద్ సడన్‌గా ఎందుకిలా ప్రవర్తించారో అర్థం గాక అటు నియోజకవర్గ ప్రజలు.. ఇటు పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారట. ఈ వింత ప్రవర్తనపై భిన్నరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం జరిగి మూడ్రోజులు అవుతున్నా ఇంతవరకూ వరప్రసాద్ గానీ.. పార్టీకి చెందిన నేతలుగానీ మీడియా ముందుకు వచ్చి స్పందించకపోవడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments