YSRCP:చంద్రబాబు పర్యటనలో విధ్వంసం.. రేపు చిత్తూరు జిల్లా పర్యటనకు వైసీపీ పిలుపు

  • IndiaGlitz, [Saturday,August 05 2023]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పుంగనూరు పర్యటనలో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్ధితుల నేపథ్యంలో రేపు చిత్తూరు జిల్లా బంద్‌కు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన తెలియజేసి బంద్‌ను విజయవంతంగా చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేఈర్‌జే భరత్ పిలుపునిచ్చారు. అటు అంగళ్లు, పుంగనూరులలో శుక్రవారం జరిగిన చంద్రబాబు రోడ్ షో ఉద్రిక్తతలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని.. వాళ్లపై వాళ్లే దాడి చేసుకుని వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తుపాకులతో సభకు రావాల్సిన అవసరం ఏంటి.. ఇలాంటి వైఖరి మంచిది కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తామని అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

కర్రలతో వస్తే నేనూ కర్రలతో వస్తా :

అంగళ్లు పర్యటనలో చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను అడ్డుకోవడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కేడర్, పోలీసులను వదలొద్దు దాడి చేసి తరిమి కొట్టాలంటూ చంద్రబాబు కార్యకర్తలను రెచ్చగొట్టారు. మీరు కర్రలతో వస్తే నేనూ కర్రలతో వస్తా.. మీరు యుద్ధం ప్రకటిస్తే నేను యుద్ధం ప్రకటిస్తానంటూ పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. డీఎస్పీ స్థాయి అధికారిని ఏయ్ నీ యూనిఫాం తీసేయ్ అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏయ్ పోలీస్ బట్టలిప్పు :

టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి.. ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ సవాల్ విసిరారు. తాను కూడా చిత్తూరు జిల్లాలోనే పుట్టాలనని.. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను బెదిరించడం, మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు అంటూ హెచ్చరించారు. రౌడీలకు రౌడీగా వుంటా.. ఏయ్ పోలీస్ వాళ్లను పంపించూ అంటూ ఫైర్ అయ్యారు. అందరూ పెయిడ్ ఆర్టిస్టులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుందని, దెబ్బలు తగిలినా, తలలు పగిలినా భయపడేది లేదని, మగాళ్లైతే పోలీసులు లేకుండా రండి తేల్చుకుందాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏయ్ పోలీస్ బట్టలిప్పూ.. రోషం లేని జీవితం నాశనం, నీ పతనం చూసేవరకు వెంటపడతానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.