ఈనెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే..
- IndiaGlitz, [Tuesday,October 24 2023]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల్లో ఉండేందుకు అధికార వైసీపీ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరైన వైసీపీ.. తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 26వ తేదీ నుంచి సామాజిక సాధికార పేరుతో బస్సు యాత్రను ప్రారంభించనుంది. ఈ యాత్రలో భాగంగా నాలుగున్నర సంవత్సరాలలో సీఎం జగన్ అందించిన సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రజలకు వైసీపీ నేతలు వివరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చట్ట సభల్లో సీట్లు నుంచి స్థానిక ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల వరకూ అన్నింటిలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ సామాజిక న్యాయాన్ని జగనన్న అందించినట్లు ప్రజల దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
దీపావళి తర్వాత రెండో దశ యాత్ర..
అక్టోబరు చివరి నుంచి డిసెంబరు 31 వరకూ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో మూడు దశల్లో ఈ యాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో తొలిదశ యాత్ర అక్టోబరు 26న ఇచ్ఛాపురంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు రూట్ మ్యాప్‌ను వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి విడుదల చేశారు. మొదటి దశ యాత్ర 12 రోజుల పాటు జరగనుంది. అక్టోబరు 27న గజపతినగరం, 28న భీమిలీ, 30న పాడేరు, నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న పలాస, 4న శృంగవరపుకోట, 6న గాజువాక, 7న ఆముదాలవలస, 8న సాలూరు, 9న అనకాపల్లితో తొలి దశ సామాజిక బస్సు యాత్ర ముగియనుంది. రెండవ దశ యాత్ర దీపావళి తర్వాత ప్రారంభించనున్నారు.
ప్రజల్లో ఉండేలా పక్కా ప్రణాళిక..
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇక జగనన్న సురక్షలో అన్ని రకాల ధృవీకరణ పత్రాలు అందజేశారు. జగనన్న ఆరోగ్య సురక్షతో గ్రామాల్లో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి వారికి వైద్యసేవలు అందించారు. డిసెంబర్ ఒకటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం కూడా చేపట్టనున్నారు.ఇలా ఏదో ఒక్క కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉండేలా సీఎం జగన్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు.