టీడీపీ ఎమ్మెల్యేలను ఓడించి గెలిచేందుకు వైసీపీ ప్రయత్నం!
- IndiaGlitz, [Wednesday,July 10 2019]
అవును మీరు వింటున్నది నిజమే.. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున కేవలం 23 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు ఎంపీలు గెలిచిన విషయం విదితమే. వైసీపీ గెలిచేసింది.. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసేసింది. అయితే ఆ 23 మంది టీడీపీ అభ్యర్థుల చేతుల్లో ఓడిన వైసీపీ నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో గెలిచిన ఎమ్మెల్యేలను ఓడించడానికి కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఎలక్షన్ కమిషన్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇలా సుమారు ఐదారుగురు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ వైసీపీ నేతలు.. ఇక తామే ఎమ్మెల్యేలు అవుతామని బహిరంగంగానే ప్రకటనలు చేసేస్తున్నారు. కాగా గతంలో కూడా ఇలా గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు. ఎవరెవరు ఏ ఎమ్మె్ల్యేలలపై కోర్టు మెట్లెక్కారనే విషయం ఈ ప్రత్యేక కథనంలోచూద్దాం.
కరణం బలరాం వర్సెస్ ఆమంచి!
ప్రకాశం జిల్లా చీరాల నుంచి వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై.. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం గెలిచారు. అయితే ఆయన ఎన్నిక చెల్లదంటూ.. ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చాడని, ఆయనకి నాలుగు పిల్లలు అయితే ముగ్గురే అన్నట్లు చూపించాడని.. ఆయన కావాలనే నాలుగో సంతానాన్ని పక్కన బెట్టాడని ఆమంచి కృష్ణ మోహన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలాలు చేశారు. కరణంకు నాలుగో కూతురు ఉందని.. ఇందుకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఆమంచి చెప్పుకొచ్చారు. ఒక అన్నగా ఆమెకి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తానని.. ఒక వేళ అంబికా తన కూతురు కాదంటే, బలరాం డిఎన్ఏ పరీక్షలకి సిద్ధమా..? అంటూ ఆమంచి సవాల్ విసిరారు.
చినరాజప్ప వర్సెస్ తోట వాణి!
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్యేగా అనర్హుడని.. ఆయన ఎన్నిక చెల్లదని పెద్దాపురం వైసీపీ ఇన్‌చార్జి తోట వాణి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాజప్పపై నమోదైన క్రిమినల్ కేసులు, అరెస్ట్ వారెంట్‌లకు సంబంధించిన పత్రాలను వాణి ఎస్పీకి అందజేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వివరాలు అన్నింటిని దాచిపెట్టి ఎన్నికల అధికారికి రాజప్ప అఫిడవిట్ దాఖలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. వైసీపీ అభ్యర్థి తోట వాణి 4వేల ఓట్ల మెజార్టీతో చినరాజప్ప గెలుపొందారు.
అనగాని సత్యప్రసాద్ వర్సెస్ మోపిదేవి..!
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణపై టీడీపీ తరపున బరిలోకి దిగిన అనగాని సత్యప్రసాద్ 11,555 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే, తనపై అనగాని సత్యప్రసాద్ ఎన్నిక చెల్లదని మోపిదేవి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ లో అనగాని తప్పుడు సమాచారం ఇచ్చారని, వ్యవసాయం, వ్యాపారాన్ని తన వృత్తిగా అందులో పేర్కొన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నట్టు చెప్పుకున్నారని న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్ లో పేర్కొన్నారు.
మద్దాలి వర్సెస్ ఏసురత్నం!
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్‌రావ్ ఎన్నిక చెల్లదంటూ ఆయనపై పోటీచేసిన వైసీపీ అభ్యర్థి ఏసురత్నం ఆరోపిస్తున్నారు. వివిధ పేర్లతో పలు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం చేశారని ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు చెప్పకుండా దాచారని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. మొత్తం 4040 పోస్టల్ బ్యాలెట్ ఓట్లొస్తే.. అందులో 312 మాత్రమే చెల్లినట్లు ఆర్వో పేర్కొన్నారని.. తొలుత ఎన్నికల విధులకు ప్రైవేటు టీచర్లను కూడా ఉపయోగించుకోవాలనుకున్న ఈసీ చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుందని ఆయన ఆరోపిస్తున్నారు.
కాగా వీరితో పాటు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులపై ఓడిన వైసీపీ ఎంపీ అభ్యర్థులు సైతం కోర్టును ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో వీరు ఏ మాత్రం గెలచి ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతారో వేచి చూడాల్సిందే మరి.