YSR District: సీఎం జగన్ చొరవతో వైఎస్సార్ జిల్లా.. ప్రగతికి ఖిల్లా..
- IndiaGlitz, [Tuesday,March 26 2024]
వైఎస్సార్ కడపజిల్లా మొత్తం రాయలసీమకు మణి మకుటమైంది. అన్ని రంగాల్లోనూ ఘనమైన అభివృద్ధిని సాధిస్తూ ఇటు సంక్షేమం విషయంలో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ జిల్లా ప్రగతిపథంలో సాగుతోంది. అటు పారిశ్రామికంగా రేసుగుర్రంలా దూసుకెళ్తున్న జిల్లాలో ఇప్పటికే రూ.4440 కోట్లతో 647 పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు ముమ్మరం అవుతున్నాయి. జిందాల్ స్టిల్స్ ఏర్పాటు చేస్తున్న భారీ ఉక్కు పరిశ్రమ భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తుంది.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రూ.128 కోట్లతో 443 కిలోమీటర్లు రోడ్లు వేయడమే కాకుండా రైతుల కోసం ఆర్బీకెలు, విలేజి క్లినిక్స్, ఆస్పత్రులు, పాఠశాలలు అద్భుతంగా తీర్చిదిద్దారు. దీంతో పేదింటి పిల్లలు సైతం కార్పొరేట్ స్కూళ్లను తలపించే విద్యాలయాల్లో సగర్వంగా చదువుకుంటున్నారు. అలాగే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు రూ.15,247 కోట్లు నగదు బదిలీ చేశారు. గతంలో ఎలా ఉన్నా జగన్ ప్రభుత్వం వచ్చాక జిల్లా రూపురేఖలు మారిపోయాయని అన్ని విధాలా వైఎస్సార్ జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగుతోందని ప్రజలు పేర్కొంటున్నారు.
అందుకే 'మేమంతా సిద్ధం' పేరుతో ఎన్నికల ప్రచారాన్ని జిల్లా వేదికగా ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలోని దివంగత సీఎం వైఎస్సార్ ఆశీస్సులు తీసుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12:30కు కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు బయలుదేరుతారు. ఒంటి గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు. అనంతరం వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు.
తదుపరి మధ్యాహ్నం 1.30 గంటలకు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల, పొట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. అక్కడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకుంటారు. ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో బస చేస్తారు. తొలి రోజు మొత్తంగా 115 కిలోమీటర్ల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది.