ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం.. ప్రముఖ సర్వేలో వెల్లడి..
- IndiaGlitz, [Wednesday,April 17 2024]
ఏపీలో పోలింగ్‌కు నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంటుందనే విషయాలపై అనేక మీడియా, సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఇందులో చాలా సంస్థలు వైసీపీ విజయం ఖాయమని చెబుతున్నాయి. తాజాగా వెల్లడైన మరో సర్వేలోనూ వైసీపీ ప్రభంజనం కొనసాగనుందని తేలింది.
రేస్ పోల్ సర్వే(RACE POLL SURVEY) ప్రకారం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 132-138 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగరేస్తుందని తేలింది. ఇక టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి కేవలం 37-42 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 16వరకు ఈ వివరాలు సేకరించాలని వెల్లడించింది. ఈ సర్వేలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు బాగుందని 54శాతం తెలపగా.. 16శాతం బాగోలేదు అని.. 26శాతం మంది పర్వాలేదని.. 4శాతం చెప్పలేమని తెలిపారు. ఇక సీఎంగా ఎవరైతే బాగుంటుందనే దానిపై జగన్ మోహన్ రెడ్డికి 61శాతం మంది మద్దతు చెప్పగా.. 31శాతం మంది చంద్రబాబుకు ఓటు వేశారు. 8శాతం ఇతరులకు సపోర్ట్ చేశారు.
ఓట్ల శాతంగా పరిశీలిస్తే మార్చి 23వ తేదీన వైసీపీకి 48.3శాతం ఉంటే.. ఏప్రిల్ 16వ తేదీకి 2శాతం పెరిగి 50.8శాతానికి చేరుకుంది. ఇక టీడీపీ కూటమికి 44.8శాతం మద్దతు ఉండగా.. ప్రస్తుతం 43.3శాతానికి తగ్గినట్లు ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరంగా చూస్తే ప్రతి నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ కనీసం 3 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. ఈ లెక్కన చూసుకుంటే 175 స్థానాల్లో 137 వైసీపీ ఖాతాలో పడగా.. టీడీపీ కూటమికి 38 స్థానాలు దక్కాయి. మొత్తంగా చూసుకుంటే రైస్ పోల్ సర్వే ప్రకారం రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని స్పష్టమవుతోంది.
అలాగే తాజాగా విడుదలైన ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌నౌ-ఈటీజీ రీసెర్చ్(TIMES NOW - ETG Research Survey)సర్వేలోనూ లోక్‌సభ ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీనే అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 19-20 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇక టీడీపీకి 3-4 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే బీజేపీ ఒక స్థానం రావొచ్చని అంచనా వేసింది. అయితే జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా దక్కదని పేర్కొంది. ఈ లెక్కన చూసుకుంటే టీడీపీ కూటమికి 5 స్థానాలకు మించి రావని.. ఏపీలో వైసీపీ హవా మరోసారి కొనసాగనుందని స్పష్టంచేసింది. ఇలా ఏ సర్వే చూసినా వైసీపీ గెలుపు ఖాయమని తెలుస్తోంది.