CM Jagan:మళ్లీ వైసీపీదే అధికారం..ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం: సీఎం జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో పోలింగ్ ముగిసి మూడు రోజులు అవుతుంది. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరికి వారు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతుంటే.. వైసీపీదే మరోసారి అధికారమని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పోలింగ్.. ఫలితాలపై తొలిసారిగా సీఎం వైఎస్ జగన్ స్పందించారు. విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్.. అక్కడ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి పార్టీ కోసం పనిచేసిన సిబ్బందికి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ఆశాభావం వ్యక్తంచేశౄరు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుందన్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన 151 అసెంబ్లీ సీట్లు కంటే ఎక్కువ సీట్లు వస్తాయని.. 22 కంటే ఎక్కువ ఎంపీ సీట్లలో గెలవబోతున్నామని తేల్చిచెప్పారు. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలో చేసిన దానికంటే ఎక్కువ మేలు చేస్తామని.. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందన్నారు. అలాగే ఐప్యాక్ మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌కు కూడా కౌంటర్ ఇచ్చారు. ఆయన ఊహించలేనన్ని సీట్లు రాబోతున్నాయని తెలిపారు.
గతంలో ఐ ప్యాక్ టీమ్‌లో ప్రశాంత్ కిషోర్ చేసేదేమీ లేదని.. మొత్తం టీమ్ చూసుకునేదన్నారు. ఏడాదిన్నరగా అద్భుతంగా పనిచేసిందని.. అందరి కృషి వల్లే అనుకున్న టార్గెట్‌ను సాధించగలుగుతున్నామని పేర్కొన్నారు. ఐప్యాక్ ద్వారా రిషీరాజ్ సింగ్ చేసిన కష్టం చాలా గొప్పదని ప్రశంసించారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారో చాలా మందికి తెలియడం లేదని.. ప్రశాంత్ కిషోర్ కన్నా రిషీ టీమ్ చాలా వర్తీ అంటూ కామెంట్స్ చేశారు. ఐప్యాక్ టీమును రిషిరాజ్ సింగ్ అనే స్ట్రాటజిస్ట్ లీడ్ చేశాడు.
కాగా ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్‌లో ఉన్నప్పుడు వైసీపీ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత పీకేతో ఒప్పందం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అంతా తానై వ్యవహరించారు. ఆ తర్వాత ఐప్యాక్ తరపున తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్లో టీఎంసీలకు పనిచేశారు. అక్కడ కూడా ఆయా పార్టీలకు విజయాలు సాధించి పెట్టారు. అయితే రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఐప్యాక్ నుంచి బయటకు వచ్చేశారు. సొంత సంస్థను పెట్టుకుని బీహార్‌లో పాదయాత్ర చేశారు. కానీ ఆ సంస్థను రాజకీయ పార్టీగా తీర్చిదిద్దలేకపోయారు.
అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్ట్రాటజిస్టుగా ఉన్న ఆయన ఇటీవల చాలా జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇచ్చారు. ఆ సమయంలో వైసీపీ చాలా భారీగా ఓడిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు ఇప్పటికే ప్రశాంత్ కిషోర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. తాజాగా సీఎం జగన్ కూడా ఐప్యాక్ సమావేశంలో కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఊహించలేనన్ని సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. మొత్తానికి భారీ మెజార్టీతో తిరిగి గెలుస్తున్నామని.. మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నానని జగన్ చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. మరి సీఎం జగన్ చెబుతున్నట్లు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com