Sharmila son: కుమారుడు పెళ్లి తేదిని ప్రకటించిన వైయస్ షర్మిల.. వధువు ఎవరంటే..?

  • IndiaGlitz, [Monday,January 01 2024]

తెలుగు రాష్ట్రాల ప్రజలు, వైఎస్సార్ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన కుటుంబానికి సంబంధించిన కీలక విషయాన్ని వైసీటీపీ అధినేత్రి వైయస్ షర్మిల వెల్లడించారు. ఆమె కుమారుడు వైయస్ రాజారెడ్డి పెళ్లి, కాబోయే కోడలు వంటి వివరాలను తెలిపారు.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల అన్నారు. రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషంగా ఉంది అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేశారు. ఈ సమయంలో అట్లూరి ప్రియ అనే యువతితో ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. షర్మిల తల్లి విజయమ్మ కూడా ప్రియకు చీర పెట్టిన ఫొటో కూడా బయటకు రావడంతో వీళ్ల పెళ్లి వార్తలకు బలం చేకూరింది. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ షర్మిల.. వీరి పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. అయితే కొంతకాలంగా షర్మిల కుటుంబంతో దూరంగా ఉంటున్న ఆమె సోదరుడు సీఎం జగన్‌ను ఆహ్వానిస్తారా..? ఆహ్వానిస్తే ఆయన వెళ్తారా..? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.

ఇక రాజకీయాల విషయానికొస్తే షర్మిల త్వరలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీకి చెందిన అనేక మంది నేతలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ దెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు