YS Sharmila: సీఎం జగన్‌తో భేటీ కానున్న వైయస్ షర్మిల.. సర్వత్రా ఆసక్తి..

  • IndiaGlitz, [Wednesday,January 03 2024]

కొన్ని సంవత్సరాలుగా ఉప్పు నిప్పులుగా ఉన్న సీఎం జగన్(CM Jagan), ఆయన సోదరి వైయస్ షర్మిల(YS Sharmila) తాడేపల్లిలో భేటీ కానున్నారు. ప్రస్తుతం కడపలో ఉన్న షర్మిల తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానం గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లి బయలుదేరి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సోదరుడు జగన్‌తో షర్మిల భేటీ కానున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి కూడా ఉండనున్నారు. జగన్‌కు కుమారుడి పెళ్లి శుభలేఖ ఇచ్చి.. వివాహానికి ఆహ్వానించనున్నారు. అనంతరం గన్నవరం నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. చాలా గ్యాప్ తర్వాత అన్న, చెల్లెలు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మంగళవారం మధ్యాహ్నం కుటుబంసభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. కుమారుడి వివాహ పత్రికను తండ్రి సమాధి దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే పోటీలో నిలవలేదు. మా మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 31 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేందుకు మేం పోటీ చేయకపోవడమే ప్రధాన కారణం. కేసీఆర్ అరాచక పాలనను అంతమొందించేందుకు నా వంతు కృషి చేశా. దేశంలోనే అతి పెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్. బుధవారం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నాను. రెండు రోజుల్లో స్వయంగా నేనే అన్ని విషయాలు వెల్లడిస్తాను’’ అని తెలిపారు.

రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. అయితే షర్మిలకు ఏఐసీసీ పదవి అప్పగిస్తారా? ఏపీ పీసీసీ పగ్గాలు కేటాయిస్తారా? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమెకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.