షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు.. వైసీపీకి సీనియర్ నేతలు గుడ్ బై..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు వైసీపీ సామాజిక సాధికార యాత్రలు.. ఇటు చంద్రబాబు జిల్లాల పర్యటన, లోకేష్ యువగళం యాత్ర.. పవన్ కల్యాణ్ సభలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణ ఏర్పడింది. ఈ తరుణంలో అనూహ్యంగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులైన ఆర్కే ఏకంగా పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. వెంటనే గాజువాక ఇంఛార్జ్ దేవన్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయడం వైపీపీలో ఒక్కసారిగా కలవరం రేగింది. వెనువెంటనే అధిష్టానం 11 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లను ప్రకటించడంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందంటూ నాయకులతో పాటు కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఏపీలోనూ తెలంగాణ స్ట్రాటజీ..
ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ జోరుగా జరుగుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక ఏపీ మీద ఫోకస్ చేసిందట. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైపోయింది. కనీసం ఆ పార్టీకి కార్యకర్తలు కూడా లేరు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఓటు బ్యాంకుగా ఉండేవి. అయితే విభజన తర్వాత వీరంతా దివంగత వైఎస్సార్ కుమారుడు జగన్ పెట్టిన వైసీపీ వైపు మళ్లారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా పట్టుకునే వారే కరువయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రమైన తెలంగాణలో దాదాపు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఏపీలో కూడా గతంలో లాగా తిరిగి పాగా వేయాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు..
ఇందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌తో వ్యక్తిగత విభేదాల కారణంగా ఆయన సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పేరుతో పార్టీ నెలకొల్పిన షర్మిల దాదాపు 4వేల కిలోమీటర్ల మేర రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. అయితే కేసీఆర్ పార్టీని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ సపోర్ట్ అవసరమని విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమెను పార్టీలో చేర్చుకుంటే నష్టమని.. ఆంధ్రా వాళ్లను ఎలా చేర్చుకుంటారనే వాదన తెరపైకి వస్తుందని రేవంత్ రెడ్డి వర్గం తీవ్రంగా ఖండించింది. కావాలంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించాలని సూచించారు. ఈ నేపథ్యంలో విలీనం ప్రక్రియ ముందుకు సాగలేదు. అయినా కానీ ఎన్నికల సమయంలో పోటీ నుంచి తప్పుకుంటామని చెబుతూ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు షర్మిల.
ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల..?
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా పాగా వేసేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా షర్మిలను పార్టీ అధ్యక్షురాలిగా నియమించేందుకు సిద్ధమైందట. ప్రస్తుత అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించారు. పార్టీ వ్యూహంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉండే ఆర్కే వైసీపీకి రాజీనామా చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కొంతకాలంగా షర్మిలతో ఆర్కే సన్నిహితంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం ఆమె ప్రచారం కూడా చేశారు. ఈ నెలఖారులోపు లేదా సంక్రాంతి పండుగ లోపు షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అధిష్టానం ప్రకటించనుందట. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
జగన్ అలర్ట్.. కొత్త ఇంఛార్జ్‌ల ప్రకటన..
ఆయనతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఆర్కే రాజీనామా.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్‌పై ధిక్కార వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. షర్మిలతో చాలా మంది వైసీపీ నేతలకు మంచి సంబంధాలున్నాయి. అందుకే ఆమెను ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తే కీలకమైన రెడ్డి సామాజికవర్గం నేతలతో పాటు మరికొంత సీనియర్ నేతలు పార్టీలో చేరే అవకాశముందని కాంగ్రెస్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట. దీంతో ఏపీలో పార్టీ బలోపేతమై.. 2029 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవచ్చని భావిస్తున్నారట. ఈ సమాచారంతో అలర్ట్ అయిన వైసీపీ అధినేత జగన్ వెంటనే నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ ఉందన్న నేతల స్థానంలో ముందుగజాగ్రత్తగా వేరే నేతలను ఇంఛార్జ్‌లుగా నియమిస్తున్నారని పార్టీ వర్గాలు గుసగులాడుకుంటున్నాయి.
వైసీపీ స్థానంలోకి వచ్చేలా ప్లాన్..
మరోవైపు జగన్ మీద ఈడీ, సీబీఐ కేసులు ఉండటం ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు విచారణకు రావడం జగన్‌కు నోటీసులు ఇవ్వడం చకాచకా జరిగిపోయాయి. మరో మూడు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచినా.. ఓడినా.. బెయిల్ రద్దు అయితే జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. ఒకవేళ ఆయన జైలుకు వెళ్తే వైసీపీని ముందుండి నడిపే నాయకులు లేరు. దీంతో షర్మిల అధ్యక్షురాలిగా ఉంటే ఆ పార్టీ కీలక నేతలంతా కాంగ్రెస్‌లో చేరతారు. అప్పుడు వైసీపీ స్థానంలోకి కాంగ్రెస్ వస్తుంది. దీంతో 2029 ఎన్నికల్లో అధికారం చేపట్టడం పెద్ద కష్టమేమి కాదని అనుకుంటున్నారట.
దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు..
మొత్తానికి కర్ణాటక, తెలంగాణలో అధికారం చేపట్టి మాంఛి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ ఏపీని కూడా చేజిక్కించుకునేందుకు పక్కా స్ట్ర్రాటజీతోనే వ్యవహరిస్తుందని తెలుస్తోంది. తమిళనాడులో ఎలాగో మిత్రపక్షమైన డీఎంకేతో కలిసి అధికారం పంచుకుంటుంది. కేరళలో కూడా అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పుడు ఏపీలో కూడా అధికారం దక్కించుకుంటే మొత్తం దక్షణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ముందుకు సాగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరి హస్తం పార్టీ పెద్దల ప్లాన్ ఫలిస్తుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout