Sharmila: హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలి: షర్మిల
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలని ప్రజలకు పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కడప ఎంపీగా ఓ వైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్ రెడ్డి బరిలో ఉన్నారని తెలిపారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ధర్మం కోసం ఒకవైపు తాను... డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని.. ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు.
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని విమర్శించారు. హంతకులను కాపాడేందుకే జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని మండిపడ్డారు. హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగనన్న, అవినాశ్‌ను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని కొనియాడారు.
అయితే ఆయన వారసుడిగా చెప్పుకునే జననన్న మాత్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని... పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్‌పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే ఇవన్నీ పూర్తయ్యేవని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా రావాలన్నా.. రాజధాని నిర్మాణం జరగలన్నా.. రాష్ట్ర అభివృద్ధి జరగలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.
కాగా ఈ బస్సు యాత్రలో షర్మిలకు మద్దతుగా వైఎస్ వివేకా కుమార్తె సునీత కూడా పాల్గొన్నారు. తన తండ్రిని హత్య చేసినా.. చేయించినా.. నిందితులకు శిక్షపడే వరకూ పోరాడతానని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాశ్ రెడ్డిని బహిరంగంగానే వివేకా హంతకుడిగా అభివర్ణిస్తున్నారు. దీంతో షర్మిల వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. మొత్తానికి కడప జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల ఎన్నికల ప్రచారం వైఎస్ వివేకా హత్య అంశం కేంద్రంగానే జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments