జగన్ నియంతలా మారారు.. వైయస్ షర్మిల ఘాటు విమర్శలు..
Send us your feedback to audioarticles@vaarta.com
తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎవరూ కితాబు ఇవ్వకపోతే తన విలువ ఎక్కువ కాదు.. తక్కువా కాదన్నారు. వైఎస్‌ఆర్ కుమార్తెను అయినప్పుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటానని తెలిపారు. తన కుమారుడికి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నానని గుర్తు చేశారు.
తనకు చాలా దగ్గర మనిషి అయినా కొండా రాఘవరెడ్డి కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారని వాపోయారు. తాను జగన్‌ను అడిగి పాదయాత్ర చేశానని మాట్లాడటం సమంజసం కాదన్నారు. మీరు చేసిన ఆరోపణలు నిజమైతే మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు. అక్రమంగా సంపాదించుకోవడానికి తన భర్తతో కలిసి జగన్ వద్దకు వెళ్లానని అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇంతవరకు ఏం ఆశించి జగన్ వద్దకు వెళ్లలేదని స్పష్టంచేశారు. ఇందుకు సాక్ష్యం మా అమ్మే. మీకు దమ్ముంటే వెళ్లి మా అమ్మను అడగండి అని షర్మిల ఛాలెంజ్ విసిరారు.
దళితులకు న్యాయం చేయకుండా అంబేద్కర్ భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదని చెప్పారు. రాష్ట్రంలో దళితులపై దాడులు వందశాతం పెరిగిపోయాయని.. దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసినవారిని పక్కన పెట్టుకుంటున్నారని విమర్శించారు. అంబేడ్కర్ ఆశయాలు అమలు కావడం లేదని.. కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రాంతీయ పార్టీలు నియంతల్లా మారి బడుగు బలహీన వర్గాలను ఇతరులతో సమానంగా చూడటం లేదన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి గుండు కొట్టి అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. మొత్తానికి పీసీసీ ఛీఫ్ అయిన షర్మిల.. ఎవరూ ఊహించని స్ధాయిలో సొంత అన్న సీఎం జగన్‌పై మాటల దాడి చేయడం సంచలనంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout