కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు సిద్ధం: వైయస్ షర్మిల
- IndiaGlitz, [Tuesday,January 02 2024]
కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని వైయస్ షర్మిల(YS Sharmila) స్పష్టంచేశారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరి, తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే పోటీలో నిలవలేదు. మా మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 31 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేందుకు మేం పోటీ చేయకపోవడమే ప్రధాన కారణం. కేసీఆర్ అరాచక పాలనను అంతమొందించేందుకు నా వంతు కృషి చేశా. దేశంలోనే అతి పెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్. బుధవారం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నాను. రెండు రోజుల్లో స్వయంగా నేనే అన్ని విషయాలు వెల్లడిస్తాను’’ అని తెలిపారు.
అంతకుముందు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జరిగిన YSRTP నేతలతో జరిగిన భేటీలో షర్మిల కీలక ప్రకటన చేశారు. జనవరి 4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు నేతలకు స్పష్టం చేశారు. అలాగే పార్టీకి ఎందుకు విలీనం చేయాల్సి వస్తుందో వివరించారు. ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్‌లో ఏ బాధ్యతలు స్వీకరించబోతున్నారని పార్టీ నేతలు ప్రస్తావించగా.. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నానని తెలిపారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) మీతో టచ్‌లో ఉన్నారా..? అనే ప్రశ్నకు కూడా నవ్వుతూ సమాధానం చెప్పారు. తన పట్ల, వైఎస్సార్ కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ఆర్కేకు ధన్యవాదాలు చెప్పారు. ఈనెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. షర్మిలను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. మొత్తానికి షర్మిల.. కాంగ్రెస్‌లో చేరతున్నారంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.