YS Sharmila:కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వైఎస్ షర్మిల

  • IndiaGlitz, [Saturday,April 20 2024]

కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతతో కలిసి కడప కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నాన్న సమాధి దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు అని.. ప్రస్తుత రాజకీయాలన్నింటినీ అర్థం చేసుకోగలరని చెప్పారు. వైఎస్ఆర్, వివేకాను ఇంకా మరిచిపోలేదని.. తన గెలుపుపై సంపూర్ణ నమ్మకం ఉందని పేర్కొ్న్నారు. అది నిరూపించుకునే సమయం ఆసన్నం అయ్యిందని పేర్కొన్నారు. ధర్మం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో భారీ మెజారిటీ‎తో గెలుస్తానని దృఢమైన నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.

అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి నివాళుర్పించారు. నివాళులు అనంతరం కడప ITI సర్కిల్ నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని కలెక్టర్ కార్యాలయంకు చేరుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ధర్మం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజలు ఆశీర్వదించి మీ ఆడబిడ్డకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

నామినేషన్‌కు బయలుదేరే ముందు ‘‘ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారిని, వైఎస్ వివేకానంద‌రెడ్డి గారిని మరిచిపోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తుంది మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ’’ అని ట్వీట్ చేశారు.

కాగా ఈసారి కడప ఎంపీ ఎన్నిక రాష్ట్రమంతా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ కుటుంబసభ్యులు ప్రత్యర్థులు తలపడుతున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి షర్మిల బరిలో దిగారు. ముఖ్యంగా వివేకా హత్య కేసు ఈ ఎన్నికలో కీలకంగా మారనుంది. వివేకా హత్య కేసుల అవినాష్ రెడ్డి నిందుతుడని.. ఆయనను సీఎం జగన్ కాపాడుతున్నారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. దీంతో వైఎస్ కుటుంబానికి కంచుకోటగా మారిన కడప గడ్డ మీద ఈసారి ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.