కడప నుంచి ఎన్నికల యుద్ధంలోకి వైయస్ షర్మిల.. ప్రచారం షెడ్యూల్ ఖరారు...
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన హస్తం పార్టీ ఇకపై ప్రచారంపై దృష్టి పెట్టింది. ఓటింగ్ శాతం పెంచుకోవడంతో పాటు వీలైనన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈమేరకు పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల ప్రచారం రూట్ మ్యాప్ ఖరారైంది. కడప ఎంపీగా పోటీలో దిగిన ఆమె అక్కడి నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బస్సు యాత్ర ద్వారా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు చేరువకానున్నారు.
కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న మొత్తం ఏడు నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా బస్సు యాత్ర షెడ్యూల్ను రూపొందించారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 5వ తేదీ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బద్వేల్ నుంచి ఆమె ప్రచారం ప్రారంభం కానుంది. బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన మండలంలో బస్సు యాత్ర మొదలై, ప్రొద్దుటూరులో ముగిసే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈనెల 12వ తేదీ వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ బస్సు యాత్ర సాగనుంది.
బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన మండలంలో ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర 12వ తేదీ రాజుపాలెం మండలంలో ముగుస్తుంది. యాత్రలో భాగంగా తొలిరోజు కలసపాడు, పోరుమామిళ్ల, కోడూరు, గోపవరం మండలాలలో ఆమె పర్యటించనున్నారు. 6వ తేదీ బద్వేలు, అట్లూరు ప్రాంతాలమీదుగా కడప చేరుకుంటారు. 7వ తేదీ దువ్వూరు, చాపాడు, కాజీపేట ఎస్, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం.. 8వ తేదీ కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లి మండలాలల్లో బస్సు యాత్ర సాగనుంది.
ఇక 10వ తేదీ పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట, వేంపల్లి, వేముల పులివెందుల, లింగాల, సింహాద్రిపురం మండలాలలో ప్రచారం చేయనున్నారు. అనంతరం 11వ తేదీ తొండూరు, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైలవరంలలో.. చివరి రోజు అయిన 12వ తేదీ జమ్మలమడుగు, పెద్దముడియం మీదుగా ప్రొద్దుటూరు చేరుకుని రాజుపాలెంలో బస్సు యాత్రను ముగించనున్నారు. ఎనిమిది రోజులపాటు ఏడు నియోజకవర్గాలలో పర్యటిస్తూ కడప పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా ప్రచారం నిర్వహించనున్నారు.
కాగా కడప ఎంపీగా వైసీపీ తరపున వైయస్ అవినాశ్ రెడ్డి పోటీ చేయనుండగా.. టీడీపీ తరపున భూపేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్ష హోదాలో షర్మిల ఎంపీగా పోటీకి సై అన్నారు. సీఎం జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టే ఈసారి ఎంపీ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తు్న్నారు. దీంతో వైయస్ కుటుంబం నుంచి ఇద్దరు నేతలు ప్రత్యర్థులుగా పోటీ చేయనుండటంతో కడప ఎంపీ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. మరి కడప గడ్డ మీద ఎవరు విజయకేతనం ఎగురవేస్తారో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments