YS Sharmila: వైసీపీ నేతలకు షర్మిల సవాల్.. నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఉందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సీఎం జగన్‌తో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆమె రచ్చబండ కార్యక్రమాల ద్వారా ఎండగడుతున్నారు. తాజాగా ప్రభుత్వం దగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఫైర్ అయ్యారు. వైఎస్సార్ వారసుడు అని చెప్పుకునే జగన్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? అని నిలదీశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసురుతూ ఆమె ట్వీట్ చేశారు.
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే.. వారసుడిగా చెప్పుకొనే జగన్ అన్న 6వేలతో "దగా డీఎస్సీ" వేశారని విమర్శించారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నాయకులు.. వీళ్లను యోధులుగా మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ చేస్తున్నాను అంటూ కొన్ని ప్రశ్నలు అడిగారు.
వైసీపీ నేతలకు షర్మిల ప్రశ్నలు..
2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ?
5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు?
ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి?
టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి?
నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా?
టెట్‌కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మధ్య కేవలం 6 రోజుల వ్యవధా?
వైఎస్ఆర్ హాయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్‌కి గుర్తులేదా?
ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా?
రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా?
మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా?
నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ అన్న.. ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ వేసి యువతను దగా చేస్తున్నారంటూ ఆమె మండిపడుతున్నారు. దీంతో షర్మిల పోస్ట్ వైరల్ అవుతోంది.
కాగా కొద్ది రోజులుగా వైసీపీ నేతలతో పాటు సీఎం జగన్‌పై తీవ్రంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. విభజన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. షర్మిల విమర్శలకు అధికార పార్టీ నేతలు కూడా ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. మరి ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి షర్మిల సవాల్‌పై వైసీపీ క్యాడర్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments