YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల నియామకం

  • IndiaGlitz, [Tuesday,January 16 2024]

అందరూ ఊహించిందే జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల(YS Sharmila) నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆమె నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అలాగే ఇప్పటిదాకా అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సీడబ్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. పీసీసీ చీఫ్‌గా ఆయన పనితీరును అభినందించింది. కాగా సోమవారం ఏపీసీసీ చీఫ్‌ పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తనపై నమ్మకం ఉంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించినందుకు పార్టీ జాతీయాధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే, యూపీఏ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి సోనియాగాంధీ, కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీకి మనస్ఫూర్తిగా షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. అంత:కర్ణ శుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తానని మాట ఇస్తున్నానని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర విభజనతో నష్టపోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తానని తెలియజేస్తున్నానని.. దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తానని హామీ ఇస్తున్నానని ట్వీట్ చేశారు.

దివంగత నేత వైఎస్సార్‌ జీవితమంతా కాంగ్రెస్‌ కోసమే పనిచేశారని ఆమె తెలిపారు. రాహుల్‌ గాంధీని దేశ ప్రధానిగా చూడటమే నాన్న కల అని.. తాను కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానని పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా కృషిచేస్తా అని ఆమె వెల్లడించారు. అయితే షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగిస్తారా? ఏఐసీసీ పదవి ఇస్తారా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. పది రోజుల నిరీక్షణ తర్వాత ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు.

తెలంగాణలో సొంతంగా రాజకీయ జీవితం ప్రారంభించిన షర్మిల 2021 జులై8న వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. అనంతరం దాదాపు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పటి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఎన్నికలకు ముందే ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండానే YSRTP ప్రస్థానం ముగిసింది.