వైఎస్ కలలు కన్న పోలవరం జగన్తో పూర్తి!
- IndiaGlitz, [Wednesday,May 08 2019]
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు కన్న పోలవరం ప్రాజెక్టును ఆయన కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణిత సమయంలోనే పూర్తి చేస్తారని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. మంగళవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చందబాబు 2014లో అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టులు, కమీషన్ల కోసం రెండేళ్ల సమయాన్ని వృథా చేశారన్నారు. దివంగత మహానేత వైఎస్ ఉండుంటే ఎప్పుడో పోలవరం పూర్తయ్యేదని చెప్పారు.
పోలవరంపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణమన్నారు. కాసుల కక్కుర్తి కోసం పోలవరాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శలు గుప్పించారు. ఇకనైనా చంద్రబాబు జిమ్మికులు, మోసాలు ఆపాలని బొత్స హితవు పలికారు. బాబు అవినీతికి పోలవరాన్ని తాకట్టు పెట్టారని విమర్శలు గుప్పించారు.
బాబు ఏదేదో మాట్లాడేస్తున్నారు..
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలలో తప్పులు జరిగాయని ఓటు ఒక పార్టీకి వేస్తే.. మరో పార్టీకి వేసినట్లు కనిపించాయని చంద్రబాబు ఏదేదో మాట్లాడి హుందాతనం పోగొట్టుకున్నారన్నారు. నిన్నటి రోజు తాను ఇంకా ముఖ్యమంత్రినే అంటూ..తన పదవి కాలం జూన్ 8వ తేదీ వరకు ఉందని మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఆయన పరిశీలించడం, చూడటంలో ఎవరికి ఆక్షేపణ లేదు కానీ.. ఆయన అధికారంలో ఉన్నపుడు మాటలు.. ఎన్నికల సమయంలో మాటలకు పొంతన లేదన్నారు.
పోలవరం కావాలని ఎంతోమంది కోరుకున్నారు కానీ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆలోచన, పట్టుదల, చిత్తశుద్ధితో పోలవరం పనులు మొదలయ్యాయని బొత్స చెప్పుకొచ్చారు. ఆప్పట్లో ఇన్చార్జ్ మంత్రిగా తాను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగిందన్నారు. ఆ మహానుబావుడు అప్పట్లో శంకుస్థాపనలు చేయడమే కాకుండా, అన్ని పరిమితులను, అనుమతులను కేంద్రం నుంచి తీసుకువచ్చారు. కాలువలను కూడా రూ.4500 కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టారని బొత్స చెప్పుకొచ్చారు. అయితే ఈ విమర్శలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.