రాజధాని ‘మార్పు’పై రెండ్రోజుల్లో వైఎస్ జగన్ కీలక ప్రకటన!
- IndiaGlitz, [Monday,December 23 2019]
ఆంధ్రప్రదేశ్‌లో కూడా సౌతాఫ్రికా లాగా మూడు రాజధానులు ఉండొచ్చేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటన అనంతరం రాష్ట్రంలో ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు రాజధాని రైతులు ఈ ప్రకటన చేసిన మరుక్షణం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనల్లో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొంటున్నారు. అంతేకాదు.. ఇవాళ జరిగిన ఆందోళనా కార్యక్రమాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం సొంత ఇలాఖా కడప జిల్లా పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటన ముగించుకుని అమరావతికి వచ్చిన అనంతరం ‘రాజధాని మార్పు’పై సంచలన ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు రాజధానులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో.. ఇది మరింత ఉదృతమయ్యే పరిస్థితులుంటాయని ముందే గ్రహించిన ప్రభుత్వం.. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి బెటాలియన్‌కు అమరావతికి రప్పిస్తోంది. ఈ క్రమంలో వారికి అమరావతిలోని అంబటినగర్‌లో బస ఏర్పాటు చేసింది. ఇప్పటికే సుమారు 300 మందికి పైగా బెటాలియన్ అమరావతికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం.. రేపు మధ్యాహ్నం పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోనున్నారని సమాచారం. ప్రకటన వెలువడే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ.. జగన్ ఇంటి చూట్టూ భారీగా పోలీసు బలగాలు మొహరిస్తాయని తెలుస్తోంది.
కాగా ఇప్పటికే రాజధానికి సంబంధించిన కమిటీ.. జగన్‌కు నివేదికను సమర్పించిన విషయం విదితమే. అయితే ప్రభుత్వం నుంచి ‘మార్పు’పై మాట మారుతుందా..? లేకుంటే మూడు రాజధానులే ఉంటాయని ప్రభుత్వం ప్రకటిస్తుందా..? అనేదానిపై ఏపీ ప్రజల్లో మరీ ముఖ్యంగా.. రాజధాని రైతుల్లో సర్వత్రా టెన్షన్ నెలకొంది. మరి జగన్ నోట ఎలాంటి ప్రకటన వస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.