Jagan vs Sharmila: అన్నాచెల్లెళ్ల సవాల్.. జగన్‌ను 'ఢీ' కొట్టబోతున్న షర్మిల..

  • IndiaGlitz, [Wednesday,January 17 2024]

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర రాజకీయాలు అన్నాచెల్లెళ్ల సవాల్‌గా మారాయి. వైసీపీకి సీఎం జగన్ అధినేతగా ఉండగా.. ఇప్పుడు సొంత సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయ్యారు. రెండు, మూడు రోజుల్లో ఆమె అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇక అప్పటి నుంచి ఏపీలో రాజకీయం రంజుగా మారనుంది. ఓవైపు టీడీపీ-జనసేన.. మరోవైపు సొంత చెల్లి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ. అందరి టార్గెట్ వైసీపీని గద్దె దించడమే. దీంతో ఇన్ని పార్టీల ఎత్తుగడలను జగన్ ఎలా ఎదుర్కోబోతున్నారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

షర్మిలతో ఎవరికీ నష్టం..?

షర్మిల వల్ల మిగిలిన పార్టీల కంటే వైసీపీకే ఎక్కువ నష్టం చేకూరనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి దళితులు, ముస్లిం మైనార్టీలు పెద్ద ఓటు బ్యాంకుగా ఉండేవారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీ వైపు మళ్లింది. కాంగ్రెస్‌కు ఓటు వేసినా వేస్టే అనే భావన రావడంతో వారంతా వైసీపీకే ఓటు వేస్తున్నారు. ఇప్పుడు వైఎస్సార్ వారసురాలిగా షర్మిల కాంగ్రెస్ చీఫ్‌ కావడంతో.. వారికి నమ్మకం కలిగిస్తే ఆ ఓటర్లు మొత్తం మళ్లీ హస్తం పార్టీ వైపు రావడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. అయితే ఇప్పుడు షర్మిల ముందున్న ఒక్కటే సవాల్.. పాతాళంలోకి పడిపోయిన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమని చెబుతున్నారు.

షర్మిలకు మద్దతుగా వైసీపీ నేతలు..

అలా చేయగలిగితే ఓటు బ్యాంకుతో పాటు వైసీపీలోని కాంగ్రెస్ వాదులందరూ బయటకు వచ్చి షర్మిల వైపు నిలబడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం వైసీపీలో సీటు రాని నేతలందరూ షర్మిల రాకతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదే కావాల్సింది. అందుకే కీలకమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్ వారసురాలు షర్మిలకు అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అందుకే కాంగ్రెస్ పెద్దలు షర్మిలపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆమె నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.

జగన్‌ పైనే పోటీకి సై..!

ఇందుకోసం సొంత అన్న జగన్‌పైనే విమర్శలు వర్షం కురిపించాల్సి ఉంటుంది. సీఎంగా ఆయన తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాలపై ముక్కుసూటిగా స్పష్టంగా స్పందించాల్సి ఉంటుంది. అయితే ఆమె ఏపీ రాజకీయాల్లోకి వచ్చారంటేనే అన్నను ఢీకొట్టడానికి పూర్తిగా సంసిద్ధమై ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైయస్ కుటుంబ ప్రాబల్యం ఎక్కువగా ఉంటే కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి షర్మిల సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కడప ఎంపీగా అవినాశ్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు స్థానాల్లో ఒక్క స్థానం నుంచి షర్మిల పోటీ చేసినా సొంత కుటుంబసభ్యులనే ఢీకొట్టాలి. స్వయంగా తానే పోటీ చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు తీసుకురావాలని ఆమె భావిస్తున్నారని హస్తం వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌లోకి వైయస్ సునీత..!

మరోవైపు వైయస్ వివేకానందరెడ్డి కూతురు వైయస్ సునీతా రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు షర్మిల సిద్ధమయ్యారని టాక్. ఇందుకు సునీత కూడా ఓకే చెప్పారట. ఒకవేళ సునీత కానీ హస్తం పార్టీలో చేరితే సునీతను కడప ఎంపీ లేదా పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారట. వైయస్ వివేకానందర్ రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి హస్తం ఉందని ఆమె సీబీఐకి ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. అలాగే పలు పిటిషన్లలో సునీత స్వయంగా ఇంప్లీడ్ అయ్యారు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్‌లో చేరి కుటుంబసభ్యులపై పోటీ చేయడానికి రెడీ అయ్యారట. ఎలా చూసుకున్నా ఇటు షర్మిల లేదా అటు సునీత ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సొంత ఫ్యామిలీనే ప్రత్యర్థులుగా పోటీ చేసే అవకాశాలు కనపడుతుండటంతో కడప జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

ఇద్దరికీ కీలకం కానున్న ఎన్నికలు..

త్వరలోనే జరగనున్న ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కంటే షర్మిల రాజకీయ భవిష్యత్‌కు కీలకం కానున్నాయి. ప్రస్తుతం నోటా కంటే తక్కువ శాతం ఓట్లతో ఉన్న పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు తీసుకురావడం.. వీలైతే ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకోవడం ఆమె ముందున్న పెద్ద సవాల్. అలాగే మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆయనకు కూడా ఈ ఎన్నికలు ప్రిస్టేజ్‌గా మారాయి. మొత్తానికి అన్నాచెల్లెళ్ల మధ్య సవాళ్లు రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి కావడం విశేషం. మరి వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారో.. ఎవరి రాజకీయ భవితవ్యం ఏంటో మరో రెండు, మూడు నెలల్లోనే తేలనుంది.

More News

ఫైబర్‌ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ట్విస్ట్

ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈ కేసును ఇవాళ విచారించాల్సిన జస్టిస్ అనిరుద్ధ బోస్

Balakrishna: 'హనుమాన్' సినిమాను చూసిన బాలకృష్ణ.. మూవీ యూనిట్‌పై ప్రశంసలు..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన 'హనుమాన్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆంజనేయస్వామిని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ తీసిన

Chandrababu: అయోధ్యకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం

యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమయం దగ్గర పడింది. జనవరి 22న జరిగే ఈ చారిత్రాత్మక వేడుకకు

Revanth Reddy: దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీజిజీ.. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ..

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో పర్యటిస్తున్నారు. గత మూడు రోజులుగా ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ అండ్ టీమ్ బిజీబిజీగా గడుపుతోంది.

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేటి నుంచి విద్యుత్ కోతలు..

హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం షాకింగ్ వార్త అందించింది. ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా హాయిగా గడుపుతున్న నగరవాసులకు ఉక్కపోత మొదలుకానుంది.