జగన్ ఊహించని ప్రకటన: ఏపీలో మూడు రాజధానులు
- IndiaGlitz, [Tuesday,December 17 2019]
వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి పరిస్థితేంటి..? అని నాటి నుంచే రాజధానికి భూములిచ్చిన, పరిసర ప్రాంతాల రైతులు ముఖ్యంగా యావత్ తెలుగు ప్రజానీకంలో పలు అనుమానాలు రేకెత్తాయి. అనుకున్నట్లుగానే వైసీపీ ప్రభుత్వం రానే వచ్చింది.. ఇప్పటికే పలుమార్లు మంత్రి బొత్సా సత్యనారాయణ రోజుకో ప్రకటన చేస్తూ హాట్ టాపిక్ అయ్యారు. ఆయన రాజధానిపై అన్నెన్ని ప్రకటనలు చేసినప్పటికీ వైఎస్ జగన్ మాత్రం ఏ రోజూ పెదవి విప్పలేదు. ఆఖరికి ఇవాళ అసెంబ్లీ వేదికగా.. ఏపీ రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందా..? మరో చోటుకు మారుస్తారా..? అనేదానిపై తేల్చేశారు.
జగన్ సంచలన ప్రకటన ఇదీ..!
‘ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ అవసరం ఉంది. సౌతాఫ్రికా మోడల్ తరహాలో ఏపీలో కూడా బహుశా మూడు రాజధానులు ఏర్పాటు చేయవచ్చు. అమరావతిలో చట్టసభలు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. పాలన ఒక దగ్గర.. జుడిషియల్ ఒక దగ్గర ఉంటాయి’ అని అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ ఎవరూ ఊహించని ప్రకటన చేశారు.
అన్నీ జనాలకు చెప్పాం!
‘రాజధానిలో జరిగిన స్కాంలపై ప్రజెంటేషన్ ఇచ్చాం. బెదిరించి ఎలా భూములు లాక్కున్నారో వివరించాం. భూములను తక్కువ ధరలకు కొని బినామీలకు కట్టబెట్టారు. 4070 ఎకరాలు చంద్రబాబు బినామీలు కొన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ఖర్చు చేసింది రూ. 5,800 కోట్లు. 10.3 శాతం వడ్డీకి అమరావతి బాంగ్స్ అని చెప్పి తీసుకొచ్చారు. దీనిపై రూ. 700 కోట్లు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. భారీ వర్షాలు పడినా రాయలసీమలో డ్యామ్లు నిండలేదు. కాల్వల సామర్ధ్యం పెంచాల్సి ఉంది. ఐదేళ్లలో చంద్రబాబు కెనాళ్ల సామర్థ్యాన్ని పెంచలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ. 16వేల కోట్లు ఖర్చు అవుతుంది. తాగునీరు ఇచ్చేందుకు రూ. 45వేల కోట్లు అవసరం’ అని వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ఏర్పాటుపై నెలకొన్న అనేక అపోహలు, సందేహాలకు ముఖ్యమంత్రి సింగిల్ ప్రకటనతో తేల్చేశారు. మరి ఈ భూముల వ్యవహారం, మూడు రాజధానుల ప్రకటనపై టీడీపీ, మేథావులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.