ఆర్నెళ్లలోపే ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా జగన్ అడుగులు!

  • IndiaGlitz, [Thursday,June 06 2019]

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శరవేగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఐఏఎస్, ఐపీఎస్.. ఉన్నతాధికారుల బదిలీలపై దృష్టి సారించిన జగన్ సుపరిపాలన దిశగా అడుగులేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన పది రోజుల్లోపే జగన్ తీసుకున్న నిర్ణయాలతో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సైతం ఒకింత ఆలోచనలో పడ్డారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆర్థిక, రెవెన్యూ, జలవనరుల శాఖ ఇలా వరుసగా భేటీలవుతూ ఒక్కో భేటీలో ఒక్కో కీలక నిర్ణయాన్ని తీసుకుని ఆయా వర్గాలకు శుభవార్తలు చెబుతున్నారు.

గురువారం నాడు వ్యవసాయ, జలవనరుల శాఖా అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా.. ఎన్నికల్లో రైతన్నలకు వైసీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేస్తాను అన్న జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జలయజ్ఞానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఊరుకునేది లేదని ఘాటుగానే హెచ్చరించారు. 

చేతల్లో రైతే రాజు..!
రైతును రాజును చేస్తానన్న మాటను ముఖ్యమంత్రి జగన్‌ నిలబెట్టుకుంటున్నారు. పాదయాత్రలో, మేనిఫెస్టోలో, పలు సభల్లో రైతులకు పెట్టుబడి సాయం రూ. 12,500 ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అక్టోబర్‌ 15 నుంచి ‘రైతు భరోసా పథకం’ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందేలా రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో  ‘రైతు భరోసా’ పథకాన్ని జగన్ ప్రవేశ పెట్టారు. అంతేకాదు.. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని.. బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.

ఇప్పటి వరకూ జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు..
- ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను...’ అంటూ ప్రమాణం చేసిన జననేత ప్రమాణస్వీకార వేదికపై నుంచే అవ్వాతాతల ఆశీస్సులు కోరుతూ పెన్షన్‌ రూ. 2,250 పెంచుతూ మొదటి సంతకం చేశారు. 
- మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాల ప్రకారం.. ఆగస్టు 15వ తేదీ నాటికి గ్రామ వలంటీర్లను నియమిస్తూ 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా అక్టోబర్‌ 2వ తేదీన గాంధీ జయంతి వరకు గ్రామ సెక్రటేరియట్‌లు ఏర్పాటు చేసి మరో లక్షా 60 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 
- మొదట ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలని, సర్కార్‌ బడులలో నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌ డే’గా జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.
- పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన కార్మికులకు రూ. వెయ్యి ఉన్న వేతనాన్ని రూ. 3 వేలు పెంచారు.
- గత ప్రభుత్వ హయాంలో చాలీచాలని జీతాలతో కాలం వెల్లదీస్తూ.. నెలల తరబడి వేతనాలకు నోచుకోక ఇబ్బందులు పడిన ఆశావర్కర్లకు రూ. 3 వేల గౌరవ వేతనాన్ని జగన్‌ ఏకంగా రూ. 10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశావర్కర్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా..
కాగా.. ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని వైఎస్ జగన్ ఆంధ్రరాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఇంకా ఆరు నెలల సమయం కూడా కాలేదు.. బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ రోజుల్లోనే తానేంటో జగన్ నిరూపించుకుంటున్నారు. మొత్తానికి జగన్ చెప్పినట్లుగానే ఆర్నెళ్లలోపే జగన్ మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో.. మున్ముంథు ఇంకా ఎన్నెన్ని చర్యలు తీసుకుంటారో..? ఎవరెవరికి శుభవార్తలు అందిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.