ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు ‘జగన్ అనే నేనే’!
- IndiaGlitz, [Wednesday,January 09 2019]
ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలన్నది తనుకున్న సంకల్పమని వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పాదయాత్ర ముగింపు రోజున భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు తన ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ అని జగన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఎల్లోమీడియాపై ఆయన నిప్పులు చెరిగారు. మీరంతా (కార్యకర్తలు, అభిమానులు,నేతలు) తోడుగా ఉంటే నారాసురుడు చంద్రబాబును, ఎల్లోమీడియాను జయించి అవినీతి పాలనను అంతం చేస్తానని ఈ సభా వేదికగా జగన్ శపథం చేశారు.
యుద్ధం నారాసురుడు ఒక్కడితోనే కాదు...
మరో మూడు నెలల కాలంలో ప్రతి ఒక్కరు సహకరించండి. అవినీతి పాలనను సాగనంపేందుకు తోడుగా ఉండండి. ఈ యుద్ధం నారాసురుడు ఒక్కరే కాదు..ఆయనకు తోడుగా ఎల్లోమీడియా, వ్యవస్థలను మేనేజ్ చేసేవారున్నారు. జిత్తులు మారిన మాయ చంద్రబాబు అనేకమైన పొత్తులు పెట్టుకుంటారు. ఈ అన్యాయాలను, మోసాలను నేను జయిస్తాను.. మీరంతా తోడుగా ఉంటే జయిస్తాను. తోడుగా ఉండమని, ఆశీర్వదించమని ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అని జగన్ పాదయాత్ర ముగింపు ప్రసంగాన్ని ముగించారు.