'వైఎస్ జగన్ అనే నేను...' దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా!
Send us your feedback to audioarticles@vaarta.com
'వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనే నేను..' అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సరిగ్గా 12:23 గంటలకు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు జాతీయగీలాపనతో ప్రమాణ మహోత్సవం ప్రారంభించారు.
వైఎస్ జగన్ అనే నేను... !
"వైఎస్ జగన్మోహన్రెడ్డి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం గానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ.. నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకు తెలియపరచనని.. లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అని జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వైఎస్ జగన్ కోసం పాస్టర్లు ప్రార్థనలు చేశారు.
కాగా.. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిసా సీఎం నవీన్‌పట్నాయక్, డీఎంకే అధినేత స్టాలిన్‌తో తెలంగాణకు చెందిన మంత్రులు, ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అశేష అభిమానులు, వైసీపీ కార్యకర్తల తరలివచ్చారు. జగన్ చాలా భావోద్వేగం ప్రమాణం చేశారు. ఇవాళ వైఎస్ జగన్ ఒక్కరే ప్రమాణం చేశారు. జూన్ 6,7 తారీఖుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments