కాన్వాయ్ ఆపి మరీ మానవత్వం చాటిన సీఎం జగన్!
- IndiaGlitz, [Tuesday,June 04 2019]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇవాళ విశాఖలో పర్యటించిన సంగతి తెలిసిందే. విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద ఆశీస్సులు పొందడం కోసం విశాఖపట్నం వెళ్లిన సీఎం జగన్ తిరిగొస్తూ తన మంచి మనసుతో మానవత్వం చాటుకున్నారు. జగన్ చూపిన మానవత్వానికి, మంచి తనానికి, ప్రేమకు.. అటు విశాఖ జిల్లా వాసులు, ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఫిదా అయిపోయారు. విశాఖలో అసలేం జరిగింది..? జనాలు ఫిదా అయ్యేంతగా జగన్ ఏం చేశారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కాన్వాయ్ ఆపి మరీ..!
స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న వైఎస్ జగన్.. విశాఖ నుంచి అమరావతికి తిరుగుపయనం అవుతుండగా రోడ్డు పక్కన.. కొంత మంది యువతీ యువకులు ‘బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న మా మిత్రుడు నీరజ్‌ను కాపాడండి’ అనే బ్యానర్ పట్టుకొని నిల్చున్నారు. వారిని గమనించిన వైఎస్ జగన్ వెంటనే కాన్వాయ్ ఆపించి మరీ.. స్వయంగా ఆయనే వారి దగ్గరికెళ్లి.. అసలేమైంది..? అని ఆరా తీశారు.
చలించిపోయిన జగన్..!
జగన్ సార్.. మా స్నేహితుడు నీరజ్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నెలాఖారులోగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు అని సీఎంకు కంటతడిపెట్టి స్నేహితులు వివరించారు. స్నేహితుడిని కాపాడుకోవడం కోసం వారు పడుతున్న తపనను చూసి జగన్ చలించిపోయారు. వెంటనే ఆపరేషన్‌కు ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
స్పాట్‌లోనే..!
ఇదిలా ఉంటే.. సీఎం ఆదేశాలతో కలెక్టర్.. ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. సీఎం సానుకూలంగా అది కూడా స్పాట్‌లో ఇలా రియాక్ట్ అవ్వడం.. మరోవైపు కలెక్టర్‌కు అప్పటికప్పుడే ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేయడంతో నీరజ్ స్నేహితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ మిత్రుడ్ని కాపాడుకున్నామని.. త్వరలోనే మాలో ఒక్కడిగా నీరజ్ తిరిగొస్తాడని.. తమకు చాలా ఆనందంగా ఉందని వారు చెబుతున్నారు.