చిరు, అలీ ఇద్దరూ కాదు.. అంబానీకి మాటిచ్చేసిన జగన్!
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే ఇదేంటబ్బా తలా తోకా లేకుండా ఉంది.. అసలు మెగాస్టార్ చిరంజీవికి.. అలీకి సంబంధమేంటి..? వారిద్దరి మధ్యలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకొచ్చారబ్బా అని అనుకుంటున్నారు కదూ..? ఎస్.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. ఇంతకీ ఆ కథేంటి..? చిరు, అలీని కాదని అంబానీకి జగన్ ఇచ్చిన మాటేంటి..? ఇక చిరు, అలీ ఆశలు ఆవిరైపోయినట్లేనా..? అనేది www.indiaglitz.com అందిస్తున్న ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
చిరు కథేంటి..!?
మెగాస్టార్ చిరంజీవిని వైసీపీ తరఫున ఏపీ నుంచి రాజ్యసభకు పంపతున్నారని గత కొన్ని రోజులు పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమన్నాయ్. అంతేకాదు.. ఇలా చేస్తే జనసేన అధినేత, మెగా బ్రదర్ పవన్ కల్యాణ్ జోరుకు బ్రేకులు వేసినట్లు అవుతుందని జగన్ భావించారట. అంతేకాదు.. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి మరింత దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాదు ‘సైరా’ సినిమా సమయంలో వైఎస్ జగన్ను చిరు కలిసిన సందర్భంలో రాజ్యసభకు వ్యవహారం చర్చకు వచ్చిందని వార్తలు వినిపించాయి. అయితే పిలిచి మరీ ఇస్తుంటే వద్దనలేక చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పుకార్లు వచ్చాయి. ఆ రోజు భేటీ అనంతరం ఇంటికొచ్చిన చిరు సుధీర్ఘంగా ఆలోచించి.. కొద్ది రోజుల క్రితమే జగన్కు నేరుగా చెప్పలేకపోయిన మెగాస్టార్.. సీఎంకు అత్యంత ఆప్తుడు, వైసీపీలో నెంబర్-02గా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి తన మనసులోని మాటను చెప్పేశారట. ‘సారీ.. నేను ప్రస్తుతం సినిమాల్లోనే నటించాలని అనుకుంటున్నాను.. అప్పుడేదో జగన్కు మారుమాట ఇవ్వలేదు కానీ.. ఇప్పుడు నేను మనసులోని మాటను బయటపెడుతున్నాను’ అని చెప్పేశారట. దీంతో ఆ రాజ్యసభ సీటుపై మరికొందరికి ఆశలు పుట్టాయట. వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఒకరిద్దరు ఉన్నారట.
అలీ సంగతేంటి..!?
ఎన్నికలకు ముందు అనేక నాటకీయ పరిణామాల మధ్య కమెడియన్ అలీ.. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. మొదట ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఈయనకు.. జగన్ హ్యాండిచ్చారట. ఆ తర్వాత ఏదైనా మంచి నామినెటెడ్ పదవి వస్తుందని భావించినప్పటికీ నాటి నుంచి నేటి వరకూ ఆయన్ను ఎలాంటి పదవీ వరించలేదు. మరీ ముఖ్యంగా శాసన మండలి రద్దు అనే వ్యవహారంతో ‘ఎమ్మెల్సీ’ ఆశ కూడా అలీలో చచ్చిపోయిందట. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం అలీకి కీలక పదవి వరించబోతోందని సమాచారం. ఈ క్రమంలో ‘పెద్దల సభకు చిరు’ పోవట్లేదట అనే వార్తలు రావడంతో అలీలో మరోసారి ఆశలు చిగురించాయి. చిరు వద్దన్నారు కదా.. ఇక ఆ పదవికి తానే అర్హుడనని భావించి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టగా.. ఫైనల్లో చూద్దామని అధిష్టానం చెప్పేసిందట.
అంబానీకి మాటిచ్చేసిన జగన్!
శనివారం నాడు ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సుమారు రెండుగంటలకు పైగా భేటీ జరిగింది. అయితే ఈ భేటీలో పలు పారిశ్రామికాభివృద్ధితో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించారట. మరీ ముఖ్యంగా.. ఏపీలో పెట్టుబడులతో ‘అంబానీ’లకు అత్యంత సన్నిహితుడుగా.. ‘రిలయన్స్’ సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్గా ఉన్న పాటు పరిమళ్ నత్వానీ విషయం గురించి కూడా చర్చించారట. అదేమిటంటే.. ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మూడోసారి రాజ్యసభ పదవీ కాలం ముగియనుండటంతో ఆయన్ను ఏపీలో భారీ మెజార్టీతో గెలిచిన వైసీపీ తరఫున రాజ్యసభకు పంపాలని జగన్ను ఆయన కోరినట్లు సమాచారం. అంతేకాదు.. ఆయన్ను రాజ్యసభకు పంపితే ఏపీలో పెట్టుబడులు కూడా భారీగానే పెడతామని మాటిచ్చారట. అయితే అంబానీ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తే నోరారా తెరిచి అడగడటంతో కాదనలేకపోయిన జగన్ మాటిచ్చేశారట. కాగా అంబానీ-జగన్ భేటీలో నత్వానీ కూడా పాల్గొన్నారు.
ఎవరికి దక్కునో..!?
వాస్తవానికి ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులకు అధికార పార్టీకి చాన్స్ ఉంది. అయితే టీడీపీకి మాత్రం అస్సలు చాన్సే లేదు. ఎందుకంటే మెజార్టీ స్థానాలు వైసీపీవే గనుక అధికారపార్టీకి నాలుగూ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా.. ఈ నలుగురిలో ఒకరు వైవీ సుబ్బారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తాన్ రావులతో పాటు చిరంజీవి పేర్లు ప్రధానం వినిపించాయి. చిరు కాదనడంతో రెండు మూడ్రోజులు అలీ పేరు కూడా వినిపించింది. మరి ఫైనల్గా ఎవర్ని ఏపీ నుంచి పెద్దల సభకు జగన్ పంపుతారో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments