మోహన్‌బాబుకు వైఎస్ జగన్ హామీ.. త్వరలో కీలక పదవి!?
- IndiaGlitz, [Thursday,November 07 2019]
ఒకానొక సందర్భంలో రాజకీయాల్లో కీలకంగా ఉన్న టాలీవుడ్ సీనియర్ నటుడు కమ్ నిర్మాత మోహన్ బాబు.. కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ క్రీజులోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు మోహన్ బాబు.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే. ప్రస్తుతానికి ఆయన పార్టీలో ఎలాంటి పదవి లేదు కానీ.. మీడియా ముందుకు వస్తే మాత్రం ఎంతటి ప్రత్యర్థులకైనా.. తనపై విమర్శలు గుప్పించిన వారికైనా దబిడి దిబిడే.! అలా వైసీపీలో కీలకంగా ఉన్న ఈయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు కానీ.. పృథ్వీ, లక్ష్మీ పార్వతి లాంటి జూనియర్లందరికీ ఇవ్వడంతో కాస్త అసంతృప్తికి లోనవుతుండటంతో సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేసి మరీ త్వరలో మీకు గుడ్ న్యూస్ ఉంటుందన్నా అని తియ్యటి శుభవార్త చెప్పారట.
ఇలాంటివి వద్దన్నా..!
వాస్తవానికి ఈయనకు టీటీడీ చైర్మన్ పదవి చేయాలని బాగా కోరిక ఉంది. నాటి అన్నగారు హయాం నుంచి నేటి వైఎస్ జగన్ పాలన వరకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండే పోయింది. ఆ తర్వాత చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ పదవి తనకంటే తనకు కావాలని ముఖ్యమంత్రి జగన్ దగ్గర నేతలు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారట. వీరిలో సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, సీనియర్ కమెడియన్ అలీ, మోహన్ బాబు ఉన్నారని తెలుస్తోంది. ఆయనకు..‘ ఇలాంటివి అన్నీ వద్దన్నా.. పెద్దల సభ అయిన రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీకి పంపుతాను’ అని హామీ ఇచ్చారట. రాజ్యసభ అంటే కీలక పదవే.
మళ్లీ అదే పదవి!
వచ్చే ఏడాది ఎలాగో రాజ్యసభలో ఒకరిద్దరు ఖాళీ అయ్యే అవకాశాలున్నాయట. అందుకే మోహన్‌బాబును ఢిల్లీకి పంపాలని అధిష్టానం భావిస్తోందట. మోహన్ బాబు వ్యవహారం చూసుకోవాలని ఎంపీ, వైసీపీలో నంబర్2గా ఉన్న విజయసాయిరెడ్డిని వైఎస్ జగన్ ఆదేశించారట. కాగా.. గతంలో మోహన్ బాబు.. ఎన్టీఆర్ హయాంలో రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన విషయం విదితమే. అందుకే ఇప్పుడు జగన్ కూడా అదే పదవి ఇవ్వాలని భావించి రాజ్యసభకు పంపుతున్నారట. మరి ఇందులో నిజమెంతుందో..? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.