ఏపీ నుంచి ‘పెద్దల’ సభకు వీళ్లే.. పక్కా వ్యూహంతో జగన్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభకు వెళ్లే అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసేశారు. మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ అవ్వగా.. నలుగురు పేర్లను జగన్.. సోమవారం నాడు అధికారికంగా ప్రకటించారు. కాగా.. వీరిలో ముందు నుంచి అనుకున్నట్లుగానే మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్లు ఉన్నాయి. మిగిలిన ఇద్దరిలో ఒకరు వైసీపీ సీనియర్ నేత, రామ్‌కీ అధినేత అయోధ్య రామిరెడ్డి కాగా.. మరొకరు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత సన్నిహితుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ నత్వానికి ఉన్నారు.
ఆ నలుగురు అభ్యర్థుల గురించి..!
వాస్తవానికి.. మండలి రద్దు తీర్మానంతో మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ పదవులు వదులుకోవాల్సి వచ్చింది. దీంతో పదవులకు త్యాగం చేసిన ఈ ఇద్దరినీ పెద్దల సభకు పంపాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయ్.. అయితే అవే ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. ఇదిలా ఉంటే.. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నయ్య అయోధ్య రామిరెడ్డికి బెర్త్ కన్ఫామ్ చేసేశారు. 2014 ఎన్నికల్లో పోటీచేసిన ఈయన 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అంతేకాదు.. తఆళ్లకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించినప్పటికీ రాలేదు. దీంతో అన్నయ్యను రాజ్యసభకు పంపుతుండటంతో ఆళ్లలో కాస్త అసంతృప్తిని తగ్గించినట్లయ్యింది.
ఇటీవలే అంబానీ స్వయంగా జగన్ ఇంటికి వచ్చి భేటీ కావడం.. ఏపీలో పెట్టుబడులు పెట్టడంతోపాటు, నత్వానిని రాజ్యసభకు పంపాలని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అక్షరాలా నిజమని తాజా ప్రకటనతో తేలిపోయింది. కాగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరిక మేరకే ఈయన అభ్యర్థిత్వం ఖరారైనట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఆయన్ను ఏపీ తరఫున పంపితే అన్ని విధాలా మేలే జరుగుతుందని పలువురు ప్రముఖులు తమ మనసులోని మాటను బయటపెట్టిన విషయం విదితమే.
ఆశలు ఆవిరయ్యాయ్..!
ఇదిలా ఉంటే.. రాజ్యసభ రేసులో అనేక మంది పోటీ పడ్డారు. బీసీ నుంచి మైనార్టీల నుంచి తమకు రాజ్యసభ పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు.. గత ఎన్నికల్లో టికెట్లు, నామినెటెడ్ పదవులు దక్కని కొందరు పెద్దల సభకు వెళ్లొచ్చని ఆశపడ్డారు. అయితే.. జగన్ మాత్రం రాజ్యసభ సీట్ల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి నిర్ణయం తీసుకున్నారు. కాగా.. చిలకలూరిపేటకు చెందిన రాజశేఖర్, ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న పండుల రవీంద్ర ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ఈ ఆశావహులందరి ఆశలు ఆవిరయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments