సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు
- IndiaGlitz, [Saturday,June 01 2019]
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నవశకానికి నాంది పలికారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సుపరిపాలన దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం విధాన నిర్ణయాలను పలువురు పరిశీలకులు, విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. సంక్షేమం, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. కాగా ఇప్పటికే.. పలువురు అధికారుల బదిలీలు, డీజీపీ, టెండర్ల రద్దు వ్యవహారాల్లో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
జగన్ నిర్ణయాల్లో కొన్ని...!!
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్ పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేయడంతోపాటు గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రకటించడం అందరి ప్రశంసలు అందుకుంటోంది. దీంతో కొత్తగా 5.50 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్ల ప్రయోజనంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 5.60 లక్షల నిరుద్యోగులకు ఉపాధి దొరకనుంది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం, లంచాలు లేని వ్యవస్థే లక్ష్యం, 5.60 లక్షల మందికి ఉద్యోగాలే లక్ష్యంగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దశల వారిగా మద్యపాన నిషేదం..
శనివారం రోజు.. ఆర్థిక, రెవెన్యూ శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ సమీక్షలో సీఎం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్యపాన నిషేధాన్ని దశాలవారి అమలుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలపై భారం పడకుండా ఆదాయ మార్గాలు చూడాలని అధికారులకు సూచించారు. దశలవారీగా మద్యపాన నిషేధానికి మార్గాలు అన్వేషించాలన్నారు. మరోసారి మద్యపాన నిషేధంపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. మద్యపానం అంటే నిరుత్సాహ పరిచేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం.. ప్రాధమికంగా వివరాలు తీసుకున్న సీఎం.. మరోమారు పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహణకు సిద్ధం కావాలని అధికారులకు నిశితంగా వివరించారు.
ఆదాయాలపై..
పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులపైన ఆర్థిక శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. కమర్షియల్, ఎక్సైజ్ శాఖల ఆదాయం పైన సీఎం వివరించారు. నిధులు కొరత లేకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎన్నికల ముందు గత ప్రభుత్వం హడావిడిగా చేపట్టిన పనులు, పెండింగ్ బిల్లులు, నిధుల ఆర్జన, శాఖల పనితీరు తదితర అంశాలపై ముఖ్యమంత్రి నిశితంగా చర్చించారు.
రూ. 5 కోట్లు మంజూరు..
రంజాన్ పండగ నేపథ్యంలో మసీదులు, ఈద్గాల్లో మరమ్మతులు, గోడలకు రంగుల కోసం ప్రభుత్వం రూ. 5 కోట్లు మంజూరు చేసింది. జిల్లాల వారీగా ఈ నిధులు విడుదలయ్యాయి. అలాగే ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్ విందులు కూడా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా..!
రాష్ట్రంలోని 44,000 ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రతి 40 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సౌకర్యాలతో సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇకపై అక్కడి నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేసేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు తగినంత మంది అధ్యాపకులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఉన్నతాధికారులు సూచించారు.
ఇదిలా ఉంటే.. సోమవారం విద్యాశాఖ, మంగళవారం జలవనరులు, గృహ నిర్మాణశాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్షిస్తారు. బుధవారం వ్యవసాయానుబంధ శాఖ, గురువారం సీఆర్డీఏపై ఆయన సమీక్షలు నిర్వహించబోతున్నారు. మున్ముంథు సమావేశాల్లో జగన్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.