2019లో కూడా సీఎం కష్టమే.. వైఎస్ జగన్ తీవ్ర అసహనం!
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ నేతలపై గుస్సా అయ్యారా..? నేను పాదయాత్రలో ఉంటే మీరంతా ఏం చేశారు..? ఏడాది పాటు చేసిన మీరు చేసిన పనులేంటో చెప్పండి..? మనకు రావాల్సిన అవకాశం.. మన ప్రత్యర్థి చంద్రబాబుకు ఎందుకిచ్చారు..? ఇంత జరుగుతున్నా గంగిరెద్దుల్లా తలలు ఊపుతున్నారే గానీ ప్రత్యామ్నాయం ఆలోచించరేం..? అని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీలు, నేతలపై వైఎస్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట. అసలు జగన్ ఆగ్రహం తెచ్చిన పనేంటి..? అసలేం జరిగిందనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
వైసీపీ వ్యూహాలను చిత్తూ చేస్తూ.. ఎప్పటికప్పుడు సంచలన ప్రకటనలు చేస్తూ చంద్రబాబు జనాల్లో మంచి పేరు సంపాదించుకుని మరోసారి ఓట్లేయించుకుని సీఎం పీఠాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన చేస్తున్న భగీరథ ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. ఇటీవల బాబు చేసిన రెండువేల రూపాయిల పెన్షన్ ప్రకటనే జగన్ అసహనానికి కారణమని తెలుస్తోంది. బాబు చేసిన ప్రకటనను జమానాలోనే జగన్ ప్రకటించేశారు. అయితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి మాత్రం వైసీపీ నేతలు ముందడుగేయక పోవడంతో జగన్ గుస్సా అయ్యారు.
టైం దగ్గరపడుతున్నా ఎందుకిలా..!
ఎన్నికలకు తిప్పికొడితే రెండు నెలలు కూడా లేవు.. అయినా వైసీపీ నేతల్లో మాత్రం ఎలాంటి ముందుచూపులేకుండానే ఉంటున్నారట. నవరత్నాలను జనాల్లోకి తీసుకెళ్లండని రెండేళ్లుగా మొత్తుకుంటున్నా ఒక్కరైనా నా మాటను పట్టించుకున్నారా..? అసలెందుకిలా చేస్తున్నారు..? పదే పదే చెబుతున్నా దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా ఎందుకుంటున్నారు..? అని పలువురు కీలక నేతలకు జగన్ గట్టిగా క్లాస్ పీకినట్లు సమాచారం. దీంతో మేం చేసేది చేశామని ఓ నేత కలుగజేసుకోగా మరింత ఆగ్రహానికి లోనైన జగన్ మీరు చేసిందేంటో ఒక్కసారి చెప్పండి అంటూ కన్నెర్రజేశారట. రోజులు ముందుకెళ్తున్నాయా.. వెనక్కివస్తున్నాయా.. టైమ్‌సెన్స్ లేకపోతే ఎలా..? ఎన్నికలు దగ్గరికొచ్చేశాయ్ అయ్యిందేదో అయ్యింది ఇకపై అయినా ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయండి..? అని మిగిలిన పార్టీ నేతలకు కూడా జగన్ హెచ్చరికలు జారీ చేశారట.
నేను పాదయాత్రలో ఉంటే మీరు చేసిందేంటి..?
ఏడాదికి పైగా నేను పాదయాత్రలో ఉంటే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏం చేశారు..? నోటి కాడికొచ్చిన అన్నాన్ని గద్దల్లాగా ప్రత్యర్థులు తన్నుకునుపోయేంత ఛాన్స్ ఎందుకిచ్చారు..? అసలు లోపమెక్కడుంది..? నవరత్నాలను మక్కీగా మక్కీగా చంద్రబాబు దించేశారు చూడండి.. ఆయనకు ఎలాంటి రెస్పాన్ వస్తోందో ఒక్కసారైనా చూశారా..? జనాల్లోకి వెళ్లి మన నవరత్నాలు గురించి చెప్పండయ్యా..? అన్నీ నేను బొట్టు పెట్టి చెప్పాలంటే ఎలా..? ఇలానే ఉంటే 2019లో కూడా మనకు అధికారం రావడం కష్టమే..? అని పార్టీ నేతలపై జగన్ గుస్సా అయ్యారని టాక్.
మనకు మీడియా కొదవా..!?
చంద్రబాబు.. పెన్షన్ ప్రకటన చేసిన క్షణం నుంచి ఇప్పటి వరకూ పేపర్లు, టీవీ చానెళ్లలో ఎక్కడ చూసిన అవే వార్తలు వస్తున్నాయ్. ‘చంద్రబాబే మా పెద్ద కొడుకు’, ‘మా బాబే’ ‘సంక్రాంతికి బంపర్ బోనాంజా’, ‘బాబు.. ఇంటికి పెద్ద దిక్కాయనే’ ఇలా రకరకాలుగా బాబుకు సంబంధించిన మీడియాల్లో ప్రత్యేక కథనాలు వస్తున్నాయ్ చూశారా..? మరి నవరత్నాల గురించి మన మీడియాలో పెద్దగా వార్తల్లేవేం..? ఆయనకంటే ఎక్కువగానే మనకు మీడియా, సోషల్ మీడియా ఉంది కదా..? ఇన్ని సోర్సెస్ ఉన్నా మీరెందుకు ఉపయోగించుకోలేకపోయారని పార్టీ నేతలపై జగన్ రగిలిపోయారని తెలుస్తోంది.
జన్మభూమిలో హంగామా ఏదీ..!
నవరత్నాలు ఎప్పుడు ప్రకటించాము..? జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి..? కనీసం జన్మభూమిని కూడా దాటలేకపోతే ఎలా చెప్పండి..? పోనీ జన్మభూమి సభల దగ్గరికెళ్లి ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం ఎవరైనా చేశారా అంటే అది కూడా అంతంత మాత్రమే.. నా పాదయాత్ర పూర్తయిన తర్వాత ఆ మైలవరం, కడప, అనంతపురం జిల్లాల్లో తప్ప మన నేతల హడావుడి ఎక్కడా కనిపించలేదేం..? ఎందుకిలా చేస్తున్నారు..? నవరత్నాలతో జన్మభూమి పోటీ పడుతోంది చూస్తున్నారా..? అది ఎవరిచ్చిన చనువు..? మీ పద్ధతులు మార్చుకోకపోవతే పార్టీకి కష్టాలు తప్పేలా లేవు.. ఇక మీదట ఎవరి పనులు వారు చేసుకొని సక్రమంగా ఉంటే సరే లేకుంటే పర్యావసనాలు మామూలుగా ఉండవ్..! అని కొందరు ముఖ్యనేతలకు ఫోన్ చేసి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట.
జగన్ తీసుకున్న క్లాస్‌తో ఇప్పటికే కొందరు నేతలు పనులు చకచకా కానిచ్చేయడానికి సిద్ధమయ్యారట. అయితే త్వరలోనే అందరు పార్టీ నేతలతో జగన్ సమావేశమై మరోసారి ఈ వ్యవహారంపై నిశితంగా మాట్లాడతారని సమాచారం. ఈ సమావేశానికి ఎంతమంది హాజరవుతారో..? జగన్ ప్రశ్నలకు ఎంత మంది దగ్గర సమాధానాలున్నాయో..? ఎంత మంది అలిగి సమావేశం నుంచి వెళ్లిపోతారో..? తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout