పేద విద్యార్థులకు జగన్ సర్కార్ ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికే ప్రజలు.. మరీ ముఖ్యంగా పేద ప్రజల కోసం ఎన్నో ఉచిత పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పేద విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో షాపులు, గుళ్లు, రెస్టారెంట్లు తదితరాలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నప్పటికీ స్కూళ్లు, కాలేజీలు మాత్రం మూతపడే ఉన్నాయి. ఇప్పట్లో వాటిని తెరవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేవ్. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించిన విషయం కావడంతో ప్రభుత్వాలు తొందరపడి నిర్ణయం తీసుకోవట్లేదు.

పేదలకు భారం కాకూడదని!

ఈ క్రమంలో పాఠశాలలు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యా బోధనకు శ్రీకారం చుట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ పరిస్థితుల్లో పిల్లలకు ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లను కొనివ్వడం తల్లిదండ్రులకు భారంగా మారుతుందని అందుకే విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కాగా.. ఉచిత స్మార్ట్ ఫోన్ పథకం అందరు విద్యార్థులకు వర్తించదు. పేద విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఫోన్లను అందించనున్నారని సమాచారం.

వీరికి మాత్రమే..

ఇదిలా ఉంటే.. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మొత్తం 60వేల మంది ఉన్నారు. వారిలో 30 నుంచి 40శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే మిగతా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా విద్యార్థులకు 5వేల నుండి 6వేల రూపాయల విలువ గల స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.