YS Jagan:ఎంతకు తెగించార్రా : విస్సన్నపేట స్కూల్లో జరిగింది ఇది .. సర్కార్ సీరియస్, ఆ మీడియాపై కేసులకు ఆదేశం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడటంలో ఆ పార్టీ పెద్దలపై ఈగ వాలకుండా చూసుకోవడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయన్నది తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. చంద్రబాబు కాకుండా ఎవరు ముఖ్యమంత్రిగా వున్నా ఈ మీడియా మామూలుగా వుండదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి నేతనే ముప్పు తిప్పలు పెట్టిన చరిత్ర ఈ మీడియా సంస్థలది. అందుకే తెలుగుదేశానికి ప్రత్యర్ధులుగా వున్న వారు దీనికి ఎల్లో మీడియాగా అభివర్ణిస్తారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస జగన్మోహన్ రెడ్డి ఏ వేదికపైకి ఎక్కినా ఎల్లో మీడియా ప్రస్తావన తీసుకురాకుండా వుండరు. మనం దుష్ట చతుష్టయంతో పోరాడుతున్నామంటూ జగన్ ఘాటు విమర్శలు చేస్తూ వుంటారు.
జగన్‌ను టార్గెట్ చేసిన ఎల్లో మీడియా :
వైఎస్ఆర్నే వదలని వాళ్లు.. వైఎస్ జగన్‌ను మాత్రం వదులుతారా. ఆయన సీఎం అయినా నాటి నుంచి ఎల్లో మీడియా తన దాడిని తీవ్రతరం చేసింది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, లేదు కోర్టులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా గోరంతలు కొండంతలు చేసి చూపుతోంది ఎల్లో మీడియా. ఇక అభూత కల్పనలు, నిరాధారమైన ఆరోపణల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లోకంలో ఎక్కడ ఏం జరిగినా దానిని జగన్‌కు ముడిపెట్టి ఇష్టానుసారం వేడి వేడి కథనాలు వండుతారు.
వర్షాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న ఎల్లో మీడియా :
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు ప్రాజెక్ట్‌లు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇప్పటికే వందలాది గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుని బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ అయ్యాయి. జనం మేడలు, మిద్దెలు , చెట్లు ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంలో శిథిల భవనాలు కూలిపోవడం, వర్షాలకు పైకప్పుల నుంచి నీరు కారడం సహజమే. ఇలాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని అనుకుందో ఏమో కానీ ఎల్లో మీడియా రెచ్చిపోయింది.
పాఠశాలలపై పచ్చ మీడియా దుష్ప్రచారం :
పాఠశాలలను టార్గెట్ చేసిన పచ్చ మీడియా.. నాడు నేడు పథకంపై అవాకులు చెవాకులు పేలింది. పైన గొడుగు - కింద మడుగు అంటూ ఈనాడు, నమ్మండి - ఇది నిజంగా బడే అంటూ ఆంధ్రజ్యోతి అసత్య వార్తలు ప్రచురించాయి. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని జడ్పీ హైస్కూల్లో పరిస్ధితులు అంటూ ఈ రెండు దినపత్రికలు కథనాలు ప్రచురించాయి. నాడు నేడు మొదటి విడత కింద రూ.66 లక్షలతో ఇక్కడ పనులు చేశారని.. కానీ గదులకు పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయలేదని అందులో రాశారు. ఈ కారణంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పైకప్పు రేకులు పగిలిన చోట్ల నుంచి తరగతి గదుల్లో నీరు కారిందని.. విద్యార్థులు తాము తడిసిపోకుండా గొడుగులు వేసుకుని కూర్చున్నారని ఫోటోలతో సహా కథనాలు రాశాయి. వీటిని బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్టులు పెట్టింది. ‘‘క్లాస్ రూమ్‌లో గొడుగు’’ పథకం అంటూ సెటైర్లు వేసింది. నాడు నేడు అంటూ ఖర్చు పెట్టిన రూ.66 లక్షలు ఎవరి జేబులోకి వెళ్లాయంటూ వ్యాఖ్యానించింది.
నాడు-నేడులో పూర్తిగా మారిపోయిన విస్సన్నపేట జడ్పీ హైస్కూల్ :
ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి విస్సన్నపేట జడ్పీ హైస్కూల్‌ను రూ.66 లక్షలతో ఆధునీకరించారు. కొత్త బెంచీలు, స్కూల్లో పచ్చదనం. శుభ్రమైన టాయిలెట్లు .. స్కూల్ చూస్తే ముచ్చటపడేలా ఉంది. అయితే ఆ పాఠశాలకు కొత్త భవనాలు, అదనపు వసతులు సమకూరడంతో కొన్ని పాత భవనాలు, అప్పట్లో నిర్మించి శిథిలావస్థకు చేరిన అస్బెస్టాస్ రేకుల భవనాలు వినియోగించకుండా వదిలేశారు. అయితే జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్టాపాలు చేసేందుకు గాను సదరు పత్రికా విలేకరులు దారుణానికి ఒడిగట్టారు.
విలేకరుల కుట్ర :
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శిథిల భవనాల్లోకి నీరు చేరడంతో పాటు పై నుంచి లీక్ అవుతోంది. దీనిని తమకు అనుకూలంగా తీసుకున్న విలేకరులు... పాఠశాల ప్రారంభం కావడానికి ముందే అక్కడ ఆడుకుంటున్న పిల్లలను ఆ శిథిలావస్థలో ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. పిల్లలను అక్కడ కూర్చోబెట్టి ఫోటోలు, వీడియోలు తీసినట్లు అధికారుల విచారణలో తేలింది. అంటే అక్కడ సమస్య ఏమీ లేకున్నా ఉన్నది లేనట్లుగా చిత్రీకరించి జనంలోకి వదిలారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈమేరకు అక్కడ విచారణ జరిపి, ఆ తప్పుడు కథనాలకు బాధ్యులైన ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఎల్లో మీడియా నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments